సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని ఆపాలని సూచించింది. ‘అది విపత్తు సాయం కిందికి వస్తుంది కాబట్టి.. నేరుగా బాధితుల బ్యాంక్ అకౌంట్లలోకి ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు’ అని మంగళవారం నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కమిషనర్ పార్థసారథి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
24 గంటలు గడవకముందే.. దీనికి భిన్నంగా బుధవారం ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ అత్యవసరంగా ఒక లేఖను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి పంపిం చారు. మంగళవారం నోటిఫికేషన్‌తో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఫలితాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని లేఖలో స్పష్టం చేశారు. వరద సాయం పంపిణీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వెంటనే దాన్ని నిలిపివేయాలని సూచించారు. దీని ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించారు.
ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు వరద సాయం దరఖాస్తుల స్వీకరణను తక్షణమే నిలిపివేస్తున్నట్లు మీ సేవ కేంద్రాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ డిస్‌ప్లే చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు హైదరాబాద్‌లో మొత్తం 6.64 లక్షల బాధిత కుటుంబాలకు వరద సాయం కింద రూ.664 కోట్లు అందజేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు సాయం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ, సాయం పంపిణీని తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
బురద రాజకీయం
భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్నహైదరాబాద్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బురద రాజకీయం చేస్తోంది. ఇప్పటికే 6.78 లక్షల మందికి వరద సాయం అందజేశాం. కేంద్రం రూపాయి ఇవ్వకపోగా... పేదలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. పేదల నోటికాడి బుక్కలాక్కునేలా చిల్లర రాజకీయాలు చేస్తోంది.
- సీఎం కేసీఆర్
ప్రమాణానికి నేను సిద్ధం
రూ. 10 వేలు వరద సాయం ఇచ్చుకోవచ్చని చెప్పిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు ఆపింది. ఇంతకన్నా చిల్లర ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా. సోషల్ మీడియాలో నా పేరుపై సర్క్యులేట్ అవుతున్న లెటర్ నాది కాదు.ఆ లెటర్ హెడ్, అందులో సంతకం కూడా నాది కాదు. కేసీఆర్‌కు సంతకాలు ఫోర్జరీ చేయడం పెద్ద విషయం కాదు. ఆ లెటర్‌పై విచారణ చేపట్టాలి.
- బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment