కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక వసతి కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాత్కాలిక వసతిలో కనీస సదుపాయాలుండాలని స్పష్టం చేశారు. వరదల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్తవి మంజూరు చేయడంతోపాటు వెంటనే పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మళ్లీ వసతి సమకూరేవరకు వారి బాగోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టంపై ఎన్యూమరేషన్ పూర్తయ్యే కొద్దీ సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై వైఎస్సార్ కడప, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అంశాలవారీగా పనులను సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా సమాచారం తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
గొలుసుకట్టు చెరువులు..
వర్షాల నేపథ్యంలో చెరువుల మధ్య అనుసంధానం చేయడంతో పాటు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలి. చెరువులు నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు తరలించే వ్యవస్థపై దృష్టి సారించాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిపై ఆధారపడ్డ పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికీ అదనపు సహాయం రూ.2 వేలు కూడా అందాలి. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు బాధితుల నుంచి అందే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా వ్యవహరించాలి. ఆర్బీకేల్లో విత్తనాలను సిద్ధం చేసి పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం.
ఆ పెద్ద మనిషి.. బురద రాజకీయాలు
రాష్ట్రంలో వరదలతో రూ.6 వేల కోట్ల మేర నష్టం జరిగితే ఇచ్చింది రూ.34 కోట్లే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం రోడ్లకు, 30 శాతానికిపైగా పంటల రూపంలో, సుమారు 18 శాతం ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ తుపాన్ వల్ల రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మరి నాడు ఇచ్చింది రూ.550 కోట్లు మాత్రమే. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.22 వేల కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పిన ఆ పెద్ద మనిషి అప్పుడు బాధితులకు ఇచ్చింది రూ.550 కోట్లే. ఇప్పుడు కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందిస్తే దానిపై కూడా బురద జల్లుతున్నారు.
గతంలో కనీసం నెల.. ఇప్పుడు వారంలోనే అన్నీ
వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంత శరవేగంగా చర్యలు తీసుకోవడం ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల సమయం పట్టగా ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు సాయాన్ని అందించగలిగాం. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్ట పరిహారాన్ని అందించాం. గతంలో ఇల్లు ధ్వంసమైనా, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణించినా పరిహారం ఇవ్వాలంటే నెల రోజులు పట్టేది. గల్లంతైన వారికి ఎలాంటి పరిహారాన్ని ఇచ్చేవారు కాదు.
అలాంటిది ఇప్పుడు వారం రోజుల్లోనే ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించి ఆదుకున్నాం. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇచ్చి సరిపెట్టగా ఇప్పుడు వాటిని అందించడమే కాకుండా రూ.2 వేల చొప్పున తక్షణ సాయం కూడా చెల్లించాం. నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా సాయం చేసిన దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం. ఇక గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment