'బాధితులను ఆదుకోవటంలో సర్కారు విఫలం'
హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా పాలకులు పెడచెవిన పెట్టారని టీటీడీపీ విమర్శించింది. ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, కనీసం మంచినీళ్లు, ఆహారపొట్లాలు, మందులను అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు జలదిగ్భంధంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం బాధితుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.
ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో వారు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా ముంపు బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు నాయకులు, అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగుయువత నాయకులు సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ప్రీ నెంబర్‌కు బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ర్ట కార్యాలయంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.
కేవలం ప్రచారానికి పరిమితం: రావుల
వరద బాధితులకు సహాయాన్ని అందించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమై కంటి తుడుపు చర్యలు చేపడుతోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అందించే సహాయం కిందివరకు వెళ్లడం లేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావల్సి వస్తోందన్నారు. ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.