
బాధితులకు భరోసా ఇచ్చిన విజయమ్మ
భారీ వర్షాలకు, వరదలకు కృష్ణా జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు పర్యటించారు.
విజయవాడ: భారీ వర్షాలకు, వరదలకు కృష్ణా జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను చూశారు. తడిసిపోయిన పంటలను పరిశీలించారు. బాధితులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. తీవ్రంగా నష్టపోయి కన్నీళ్ల పర్యంతమైన బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభలో పంట నష్టం అంశాన్ని లేవనెత్తి రైతుల తరపున పోరాడతామని చెప్పారు. తడిసిన పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాస్తామని ధైర్యం చెప్పారు.
భారీ వర్షాలకు ఇంత నష్టం జరిగినా ఈ ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీళ్ల పాలై అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని బాధపడ్డారు.
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి నుంచి విజయమ్మ పర్యటన ప్రారంభమైంది. షేర్‌మహ్మద్‌పేట, గౌరవరం, ముళ్లపాడు, రాఘవపురం గ్రామాల మీదుగా సాగింది. అనుమంచిపల్లిలో తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. రైతులను కలుసుకుని సాదనబాధకాలను అడిగి తెలుసుకున్నారు. జగ్గయ్యపేట, షేర్‌మహ్మద్‌పేటలో వరి, మొక్కజొన్న, మిరప, పత్తి, క్యాలీఫ్లవర్ పంటల దుస్థితి చూసి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిముద్దైన పంటలను విజయమ్మకు చూపించి రైతులు కన్నీరుపెట్టుకున్నారు. ముళ్లపాడు, రాఘవపురంలో నీట మునిగిన పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆ పొలాలను చూసి విజయమ్మ చలించిపోయారు. కుండపోత వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వరి, పత్తి, మొక్కజొన్ని, క్యాలీఫ్లవర్ ఏ పంట చూసినా మొత్తం దెబ్బతిని ఉందన్నారు. రైతులకు తక్షణసాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇప్పించేవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.
పంట నష్టపోయి రైతన్నలు అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని విజయమ్మ మండిపడ్డారు. ఎకరానికి 10వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.