సాక్షి, అమరావతి: ఎలాంటి హడావిడి లేకుండా అధికార యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనిస్తే అద్భుత ఫలితాలుంటాయనడానికి ‘ఫొని’ తుపాను సందర్భంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘రేయింబవళ్లు సమీక్షలు లేవు.. అది చేయండి.. ఇది చేయండి.. ఇలా కాదు.. అలా కాదు.. అనే సీఎం చంద్రబాబు హడావిడి అసలే లేదు.. మంత్రులు, సీఎం పర్యటనలు లేవు.. తుపాను సన్నద్ధత, బాధితులకు సహాయ కార్యక్రమాలను గాలికొదిలి సీఎం బాబు కోసం నిరీక్షణ అంతకన్నా లేదు.. వెరసి ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో, పునరావాస ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? సన్నద్ధత ఎలా ఉండాలి? అనే అంశాలపై వివిధ కీలక హోదాల్లో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు ఉన్న అనుభవం ఇప్పుడు ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగానికి బాగా ఉపయోగపడింది. ‘తుపాను ప్రభావం చూపడానికి రెండు మూడు రోజుల ముందే సీనియర్ అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు.
ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందే తెలిసినందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలా అన్ని అంశాలపై అధికారులకు తన అనుభవంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం మార్గనిర్దేశం చేశారు. సంబంధిత అధికారులంతా అంకిత భావంతో పనిచేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాయి. హడావిడి మాటే లేదు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలో అవన్నీ యథా ప్రకారం జరిగిపోయాయి. తుపాను తీరం దాటిన రెండో రోజుకే ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. మార్గనిర్దేశం బాగుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’ అని క్షేత్ర స్థాయి అధికారులతోపాటు ఐఏఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విపత్తు నియమావళి చెప్పిందదే..
‘విపత్తులు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయి అధికారులను ఎవరి పని వారు చేసుకోనివ్వాలి. వీఐపీలు, ప్రజా ప్రతినిధులు వెళ్లి హడావిడి చేస్తే బాధితులకు సేవలు పక్కన పెట్టి అధికారులు, వీరి వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది సహాయ కార్యక్రమాలకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల విపత్తులు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాల పర్యటనలు పెట్టుకోరాదు’ అని విపత్తు నిర్వహణ నియమావళి స్పష్టంగా చెబుతోంది. సీఎం చంద్రబాబు ప్రచార యావతో దీనికి విరుద్ధంగా వ్యవహరించడం రివాజుగా మారింది. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖలో మకాం వేసి సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘తిత్లీ’ తుపాను సందర్భంగానూ ఇలాగే హడావిడి చేశారు. అధికారులంతా ఆయన వెంట తిరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. దీంతో వారాల తరబడి నిత్యావసర సరుకులు, తాగునీరు సైతం అందక బాధితులు ధర్నాలకు దిగడం తెలిసిందే.
ఐఎండీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు
‘ఫొని’ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అత్యంత కచ్చితమైన ముందస్తు అంచనాతో భారత ప్రభుత్వం చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. చక్కటి అంచనాలతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం బాగా తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో కొనియాడింది. తుపాను.. తీరం ఎక్కడ దాటుతుంది? ఈ సమయంలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే అంశాలన్నింటినీ చాలా ముందుగా అత్యంత కచ్చితంగా ఐఎండీ అంచనాలు వేసిందని, అందువల్లే ప్రభుత్వం 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయగలిగిందని ప్రశంసించింది. ఈ మేరకు ఐఎండీకి లేఖ పంపినట్లు తమకు సమాచారం అందిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో హర్షం
ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాన్ వల్ల రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెనుగాలులకు స్తంభాలు వంగిపోవడం, వైర్లు తెగిపోవడం లాంటి కారణాలవల్ల 740 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయినా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శనివారం ఒక్కరోజే అత్యధిక గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారు. గాలుల వేగం ఎలా ఉంటుంది? వర్షం ఏ మోతాదులో కురుస్తుందనే అంశాలపై ఐఎండీ ఇచ్చిన అంచనాల మేరకు సీఎస్ మార్గనిర్దేశం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. రెండు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడనుంది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి సాయం తర్వాత అందిస్తారు’ అని విపత్తు నిర్వహణపై అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment