‘ఫొని’ నష్టం రూ.58.61 కోట్లు  | Cyclone Fani Loss Is Above Rs 58 crore | Sakshi
Sakshi News home page

‘ఫొని’ నష్టం రూ.58.61 కోట్లు 

Published Sun, May 5 2019 4:15 AM | Last Updated on Sun, May 5 2019 4:15 AM

Cyclone Fani Loss Is Above Rs 58 crore - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌ కుమార్‌ సిన్హా , పాల్గొన్న సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం

సాక్షి, అమరావతి : ఫొని తుపాను కారణంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రూ.58.61 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా అని ఆయన చెప్పారు. తుపాను సహాయక చర్యలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా రాష్ట్రంతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టం, తీసుకున్న చర్యలను సీఎస్‌ ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 19.7 సెంమీల వర్షపాతం నమోదైందన్నారు. ఇదే జిల్లాలోని నాలుగు మండలాల్లో 2 లక్షల 74వేల మంది తుపానుకు ప్రభావితమయ్యారన్నారు. 304 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 168 ఇళ్లు పాక్షికంగాను, 19 పక్కా ఇళ్లు.. 35 కచ్చా ఇళ్లు పూర్తిగాను దెబ్బతిన్నాయని సిన్హాకు సీఎస్‌ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 15,460 మందిని 139 పునరావాస కేంద్రాలకు, విజయనగరం జిల్లాలో 2వేల మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. బాధితుల కోసం 348 వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. 

958 హెక్టార్లలో పంటలకు నష్టం 
కాగా, తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లో 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఎల్వీ చెప్పారు. 214 హెక్టార్లలో వరి, 743 హెక్టార్లలో వేరుశనగ, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలకు నష్టం కలిగిందన్నారు. సుమారు 10 వేల కొబ్బరి చెట్లు నేలకూలగా 1,991 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 229 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి వివరించారు. అలాగే, రోడ్లు, భవనాల శాఖకు రూ.21.57 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ రహదారులకు రూ.20.05 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.9.75 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.4.09 కోట్లు, మున్సిపల్‌ పరిపాలనా శాఖకు రూ.1.82 కోట్లు, గ్రామీణ రక్షిత మంచినీటి విభాగానికి రూ.42.68 లక్షలు, గృహ నిర్మాణానికి రూ.85.35 లక్షలు, పశు సంవర్థక శాఖకు రూ.3.94 లక్షలు కేటాయించామన్నారు. కాగా చేనేత జౌళిశాఖ సహా పలు రంగాలకు సంబంధించి ప్రాథమిక నష్టం అంచనాలను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన  తెలిపారు.  

దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు 2,100  
తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 733 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగిందని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ చెప్పారు. 33 కేవీ ఫీడర్లు 19, 11 కేవీ ఫీడర్లు 101, 11/33 కేవీ ఫీడర్లు 45 దెబ్బతినగా సుమారు 2,100 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని మండల కేంద్రాలకు ఇప్పటికే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో 74 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. దెబ్బతిన్న స్తంభాలన్నింటితోపాటు.. లక్షా 73 వేల వ్యవసాయేతర విద్యుత్‌ సర్వీసులను పునరుద్ధరించామన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా, మున్సిపల్‌ పరిపాలన, ఆర్‌ అండ్‌ బి శాఖలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సిన్హా మాట్లాడుతూ.. నష్టం అంచనాలను త్వరితగతిన అంచనా వేసి పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

ఒడిశాకు రాష్ట్రం చేయూత 
రాష్ట్రం నుంచి రెండు లక్షల టార్పాలిన్‌ ప్లాస్టిక్‌ షీట్లు, 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు, యాంత్రిక రంపాలను హెలికాప్టర్‌ ద్వారా ఒడిశాకు పంపిస్తున్నట్లు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి తెలిపారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఎల్వీ మాట్లాడారు. అవసరాన్ని బట్టి వీటిని యుద్ధప్రాతిపదికన పంపించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్‌ను సీఎస్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీ, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్, ఆర్టీజీఎస్‌ సీఈఓ బాబు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement