
‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి
స్వచ్ఛంద సంస్థలకు నిర్బంధం
పలు చోట్ల దాడులు
‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి
పాలకుల తీరుపై అసంతృప్తి
చెన్నై: మానవత్వంతో బాధితుల సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు అధికార పక్షం ఒత్తిళ్లు తప్పడం లేదు. తాము చెప్పిన ప్రదేశాలకే సహాయకాలను సరఫరా చేయాలంటూ కొందరు, తమ నేతృత్వంలోనే అందించాలంటూ ఇంకొందరు, ఇక అమ్మ బొమ్మ తథ్యం అంటూ మరి కొందరు నిర్బంధిస్తుండడంతో మానవతా హృదయులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పడం లేదు. తాము చెప్పింది వినకుంటే దాడులు తప్పవని హెచ్చరించి ప్రత్యక్షంగా చూపిస్తుండడంతో ఆయా సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఆవేదనకు లోనవుతున్నారు. ఇది చెన్నై పరిధిలో పలు చోట్ల సాగుతున్న అధికార జులుం కావడంతో సర్వత్రా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి ప్రళయానికి చెన్నై, శివారులు నరకయాతనను చవిచూస్తున్నాయి. ఇళ్లను, వస్తువులను కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డ వాళ్లు వేలాది మంది ఉన్నారు. లక్షలాది మంది వరద తాకిడితో ఆపన్న హస్తం కోసం చేతులు చాచక తప్పడం లేదు. ఏ రోడ్డులో చూసినా తమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు సహాయకాలతో రాక పోతారా అని ఎదురు చూసే పేద కుటుంబాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై నగరవాసుల్ని ఆదుకునేందుకు తామున్నామంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మానవతా హృదయం కల్గిన వాళ్లు కదిలారు. అన్నం కోసం, తాగునీటి కోసం అలమటిస్తున్న నగరవాసుల్ని ఆదుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. ఆహార పదార్థాలే కాదు, సర్వం కోల్పోయిన వాళ్లకు అవసరమైన వస్తువుల్ని సైతం అందించేందుకు చెన్నై బాట పట్టారు. వందలాది సంస్థలు, సంఘాలు చె న్నై బాధితుల సేవలో నిమగ్నమయ్యాయి. ఆధునిక యుగంలో ఇంకా మానవత్వం ఎక్కడో ఒక చోట ఉందని నిరూపించుకునే విధంగా సాగుతున్న ఈ సహాయకాలకు అధికార అడ్డంకులు ఎదురవుతున్నాయి. చెన్నై శివారుల్లోనూ లారీల్ని ఆపడం, అమ్మ బొమ్మలను తగిలించ డం వంటి చర్యలకు పాల్పడే అన్నాడీఎంకే వర్గాలు కొందరు అయితే, తాము పెట్టిందే చట్టం, తాము చెప్పినట్టు వినాల్సిందే, తాము చెప్ని చోటే పంచాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే వారు మరి కొందరు. సహాయకాలు రాగానే, తమను పిలిచి , తమ చేతుల మీదుగానే పం పిణీ చేయించాలంటూ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ప్రతినిధులపై మరెందరో అధికార జులుం సాగించే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల కార్పొరేషన్‌కు అప్పగిస్తే, వాళ్లే చూసుకుంటారంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక నోరు మెదప లేని కొన్ని సంఘాలు వారి ఒత్తిళ్లకు తలొగ్గుతుంటే, మరెందరో మానవతా హృదయులు ఇదేంటంటూ పెదవి విప్పే పనిలో పడ్డారు. మరి కొందరు ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ఇ లాంటి వారిపై ఏకంగా దాడులకు సైతం దిగుతుండడంతో పాలకుల తీరుపై అసంతృప్తి రగులుతోంది. కింది స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల వీరంగాలకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నామంటూ స్వచ్ఛంద సంస్థలకు, సంఘాలకు చెందిన పలువురు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము చెప్పింది వినకుంటే దాడులు సైతం చేస్తామని హెచ్చరించి మరీ, చేసి సైతం చూపించడంతో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి.
దాడితో కలవరం: నిర్బంధం, ఒతిళ్లు ఓ వైపు సాగుతుంటే, సోమవారం అన్నానగర్‌లో ఏకంగా దాడి సైతం జరగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. అడయార్, కోట్టూరుపురంలలో పోలీసుల ద్వారా అడ్డుకోవడంతో అధికార జులుంపై విమర్శలు బయలు దేరుతున్నాయి. దాడికి గురైన వాళ్లు తమిళనాడులోని సంస్థలకు చెందిన వాళ్లు కూడా కాదు, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి సేవల్ని అందిస్తున్న బెంగళూరుకు చెందిన మానవతా హృదయులు. బెంగళూరు నుంచి ఓ సంస్థ నేతృత్వంలో పదిహేను బృందాలు చెన్నైలో రెండు రోజులుగా సేవల్ని అందిస్తున్నాయి. ఇక్కడున్న మరో సంస్థ సహకారంతో అక్కడున్న బృందాలు అన్నానగర్‌లోని గంగయమ్మన్ ఆలయం వద్ద అన్నాహారాలు స్వయంగా తయారు చేస్తూ, ఎక్కడెక్కడల్లా బాధితులు ఆకలితో అలమటిస్తున్నారో తమ బృందాల ద్వారా గుర్తించి అక్కడికి సరఫరా చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం అక్కడకు వచ్చిన అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి తమిళ్‌సెల్వన్ , ఆయన మద్దతుదారుడు రాజాతో కూడిన బృందం ఆ సంస్థ ప్రతినిధుల్ని పిలిపించి ఓ లిస్టు చేతిలో పెట్టారు. ఆ లిస్టు ఆధారంగా ఆహార ప్యాకెట్లను అక్కడున్న తమ వాళ్ల చేతికి ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. తమ బృందాలు తోడుగా వస్తాయని, ఎక్కడెక్కడ సరఫరా చేయాలో తమ వాళ్లే చేస్తారని సూచించారు. ఇందుకు అంగీకరించని తమిళ్‌సెల్వన్ బృందం తమ చేతికి పని పెట్టారు. పత్రికల్లో రాయలేని పదజాలాలతో ఆ మానవతా హృదయుల్ని దూషించారు. ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు బయటకు వెళ్లనీయకుండాఅడ్డుకుంటామంటూ దాడికి సైతం దిగారు. ఆ సంస్థ ప్రతినిధుల్ని తరిమి తరిమి కొట్టడంతో అక్కడున్న జనంలో ఆగ్రహం రేగింది. మానవత్వంతో ఎక్కడి నుంచో వచ్చి రెండు రోజలుగా వర్షంలో తడుస్తూ స్వయంగా తయారు చేసి మరీ వేలాది మందికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న వాళ్లపై ఏమిటీ ఈ జులుం అంటూ ప్రశ్నించడమే కాదు, తిరగబడే యత్నం చేశారు. ప్రజలు తిరగబడడంతో అక్కడి నుంచి తమిళ్‌సెల్వన్ బృందం జారుకుంది. అయితే, ఆ సంస్థ ప్రతినిధులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయినా, తమ సేవను మాత్రం ఆపలేదు. ఇదే నిజమైన మానవత్వం అంటే అని నిరూపించుకున్నారు. తమిళ్‌సెల్వన్ బృందం వీరంగాన్ని అక్కడున్న యువత రహస్యంగా తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, దానిని ఓ మీడియాకు పంపించడంతో అధికార పార్టీ నాయకుల జులుం ఇలా కూడా ఉంటుందా అని రాష్ట్రానికి తెలిసి వచ్చింది. ఇదే విధంగా అడయార్, కొట్టూరుపురంలలో బాధితులకు దుప్పట్లను పంచుతున్న యువకులపై తిరగబడడమే కాదు, వారేదో నేరం చేసిన వారిలా పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. వారి చేతుల్లో ఉన్న దుప్పట్లను, సహాయకాలను అధికార సేనలు లాక్కెళ్లడం కూడా మరో చానల్‌లో ప్రత్యక్షం కావడం గమనార్హం. ఎలాంటి స్వలాభం చూసుకోకుండా, జాతి మతం భేదం లేకుండా సేవల్ని అందిస్తున్న సంఘాలపై ఇలాంటి దాడులు సాగడం సిగ్గు చేటు అని పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరెన్నో చోట్ల నగరంలో సాగుతున్నాయన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉండడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి సీఎం జయలలిత స్పందిస్తారా.? అన్నది వేచిచూడాల్సిందే. లేని పక్షంలో మరేదైనా విపత్తులు ఎదురైనప్పుడు తమిళనాడు వైపుగా వచ్చేందుకు మానవతా హృదయులు భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సి వస్తుందేమో!