
ఒక్క రోజే రూ.12 కోట్లు ...
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్ణయించారు. నెల రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మంగళవారం ఒక్క రోజే వరద నివారణ నిధికి రూ.12 కోట్లు వచ్చాయి.
చెన్నై : ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్ల్లూరు, కడలూరులు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకునేందుక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కదిలాయి. పెద్ద ఎత్తున విరాళాల్ని అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎమ్మెల్యేలు తమ నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో అదే బాటలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమయ్యారు.
అన్నాడీఎంకేకు అసెంబ్లీలో సంఖ్యా పరంగా 150 మందికి పైగా ఉన్నారు. అలాగే, పార్లమెంట్ సభ్యులు 37 మంది, మరి కొంత మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరంతా తమ నెలరోజుల వేతనాన్ని సీఎం రీలీఫ్ ఫండ్‌కు అప్పగించేందుకు నిర్ణయించారు. జయలలిత ఇచ్చిన పిలుపు మేరకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి చొప్పున కేటాయించేందుకు ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. మంగళవారం కూడా పలు సంస్థలు సీఎం జయలలితను కలిసి విరాళాలు అందజేశాయి. కరూర్ వైశ్యాబ్యాంకు రూ.3 కోట్లు అందజేసింది.