ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలపై లేఖ రాస్తే కేంద్రం పరిహారం ఇవ్వదని, సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వలేద న్నారు. ఆయన ఆదివారం విశాఖలో గ్లోబల్ యూత్ మీట్ సదస్సులో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
'ఏపీకి ప్రకృతి వైపరీత్యాల కింద ఇవ్వాల్సిన రెండు విడతల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇటీవల వరదల నష్టానికి అదనంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే పరిహారం రాదు.. ఇంత పంట నష్టం, ఇన్ని రోడ్లు, సమాచార, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయని సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్ర బృందం వస్తుంది. వారు కొన్ని ప్రాంతాలు తిరిగి ఓ అంచనాకొస్తారు. విశాఖలో హుద్‌హుద్ తుపానుకు నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అది రూ. 733 కోట్లు నష్టమని నిరూపించారు.' అని వెంకయ్య వివరించారు. అలాగే వారం పది రోజుల్లో వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఆమోదిస్తామని ఆయన తెలిపారు.