ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం వాడీవేడిగా జరిగింది.‘జిల్లాలో ఏం జరుగుతుందో తెలియడంలేదు. నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో తెలియదు. వచ్చిన వాటిని ఎలా ఖర్చు చేయాలో మీకు అర్థం కాదు’ అని మంత్రి ధ్వజమెత్తారు. సభ్యుల ప్రశ్నలతో సమావేశం ఉత్కంఠగా సాగింది.
ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా?
గత నెలలో సంభవించిన వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల గురించి అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సంకువానిగుంట గ్రామస్తులు ఆరురోజులపాటు నడుం లోతు నీళ్లల్లో ఉన్నారని.. వారంతా దళితులేనని తెలిపారు. వారి బాగోగులు పట్టించుకోకుండా ఒక్కరోజు భోజనం పెడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. తామే పడవలో వెళ్లి బాధితులకు ఆహారం అందించాల్సి వచ్చిందని తెలిపారు.
హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి..
బాధితులను ఆదుకోవాలని తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంత సమస్య పరిష్కరించాలంటే వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీనిపై ఒంగోలు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయామని.. ఇప్పుడు పంపిణీ చేయిస్తామనడంతో సభ్యులతో పాటు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా ఆ గ్రామంలో బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వమే శనగలు కొనుగోలు చేయాలి
జిల్లాలోని కోల్డుస్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలను ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలో 44 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. నియోజకవర్గంలో ఒక అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని కూల్చివేసి అందులోని సామగ్రిని అమ్ముకున్నారని ఆరోపించారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఐసీడీఎస్ సమస్యలను ప్రస్తావించారు. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలో 18 హెచ్‌ఎం పోస్టులు.. 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
హాస్టళ్ల నిర్మాణాలు ఎక్కడ?
సింగరాయకొండ, తిమ్మసముద్రంలో చేపట్టిన బీసీ హాస్టళ్ల నిర్మాణాలు గత నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని కొండపి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జీవీ శేషు, బీఎన్ విజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం తమకు సంబంధంలేదంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రకటించడంతో.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా ఎవ రో తెలియకుండానే పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. కారకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టులపై రచ్చ..
పాలేటిపల్లి, మల్లవరం రిజర్వాయర్లు, కొరిశపాడు చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల వివరణ ఎవరినీ సంతృప్తి పరచలేదు. వెలిగొండ టన్నెల్ నిర్మాణం కేవలం 46 శాతం పూర్తయితే.. నిర్మాణం మొత్తం ఎప్పటికి పూర్తవుతుందని ఎస్‌ఈని ప్రశ్నించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని తమ భూములు స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వుతున్నారని.. కానీ ఇప్పటికీ నష్టపరిహారం పంపిణీ చేయలేదన్నారు. ప్రాజెక్టు వ్యవహారాలపై ఇంజినీరింగ్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, జాతీయరహదారుల శాఖల తో మరోసారి సమావేశం కావాలని తీర్మానించా రు. రిమ్స్ నిర్మాణాల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు.
బ్యాంకర్లు సహకరించడంలేదు..
బ్యాంకర్ల వల్ల రైతుల నష్టపరిహారం పంపిణీ జాప్యమవుతోందని వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. నీలం తుపాను పరిహారంగా జిల్లాకు రూ 5.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికి రూ 2.38 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ అధికారులు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయడానికి సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తూ సోమవారమే అకౌంట్లకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వాడీవేడిగా
Published Mon, Nov 11 2013 5:47 AM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
Advertisement
Advertisement