జల బీభత్సానికి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ఊరూవాడ ఏకమై నీరు ప్రవహిస్తోంది.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జల బీభత్సానికి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ఊరూవాడ ఏకమై నీరు ప్రవహిస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా రైతన్నలకు అపారనష్టం సంభవించగా, పేదలకు అంతులేని కష్టం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు బిక్కుబికుమంటున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ ందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా మంది చుట్టూ తిరిగి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గమ్యం చేరుకుంటున్నారు. 30కి పైగా గ్రామాల రోడ్లు పాడై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. సామర్థ్యానికి మించి నీరు చేరుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే గేట్లు ఎత్తివేయవలసి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఆయా ప్రాజెక్టుల పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో, పూరిళ్లల్లో నివసిస్తున్న వారు బిక్కుబిక్కుమంటున్నారు. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, రామభద్రపురం మండలాల్లో పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పూసపాటిరేగ మండలంలో కుండపోత వర్షం కురిసింది. అక్కడ 20 సెంటీమీటర్లు, భోగాపురంలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లు కాగా శుక్రవారం నాటికి జిల్లావ్యాప్తంగా 254.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
స్తంభించిన జనజీవనం...
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బయటకు కాలుపెట్టలేక చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు. తాటాకు ఇళ్లు, పాత భవనాల్లో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపుతున్నారు. ఉపాధి లేక చాలా కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. భవన నిర్మాణరంగంతో పాటూ ఫుట్‌పాత్ వ్యాపారులు, కిరాణా వ్యాపారులు సైతం నష్టపోయారు. రైతులతో పాటూ అన్ని వర్గాల ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు బయటకు రాలేక ఇబ్బందిపడుతున్నారు.
7,601 ఎకరాల్లో పంట నష్టం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 7,601 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఈమేరకు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేసి వ్యవసాయశాఖ కమిషనర్‌కు పంపించారు. వరి 3,652 ఎకరాలు, మొక్కజొన్న 1,117 ఎకరాలు, పత్తి 2,792 ఎకరాలు, చెరుకు పంటకు 40 ఎకరాల్లో నష్టం వాటిల్లింది
617 ఇళ్లు నేలమట్టం...
వర్షాలకు జిల్లాలో మొత్తం 617 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వీటిలో పూర్తిగా 64, తీవ్రంగా 46, పాక్షికంగా 507 ఇళ్లు కూలిపోయాయి. వీటి నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇద్దరు మృతి
అధిక వర్షాలకు శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. జామి మండలం భీమసింగి గ్రామంలో మర్రిచెట్టు కూలి మజ్జి సత్తిబాబు(45)అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే భోగాపురం మండలం రాళ్లపాలెం గ్రామంలో చలికి తట్టుకోలేక ముడసర్ల ముత్యాలమ్మ(65) అనే వృద్ధురాలు మృతి చెందింది. వెంగళరాయసాగర్‌కు కుడి కాలువకు గండిపడడంతో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 4.5 కిలోమీటర్ల రోడ్డు కోతకు గురైంది. 36 చెరువులకు, ఎనిమిది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గండ్లుపడ్డాయి.
51 గ్రామాలకు నీటి సరఫరా బంద్
వరద ఉద్ధృతి కారణంగా ఏడు ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలకు ముప్పు వాటిల్లింది. దీంతో 51 గ్రామాలకు నీటిసరఫరా బంద్ అయింది.