ప్రకృతి ప్రకోపానికి బలై విలవిల్లాడిన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదుకోడానికి బెంగళూరులో 10కె రన్ నిర్వహిస్తున్నారు.
ప్రకృతి ప్రకోపానికి బలై విలవిల్లాడిన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదుకోడానికి బెంగళూరులో 10కె రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సామాన్య ప్రజల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు అన్ని వర్గాలకు చెందినవారు పాల్గొంటున్నారు. స్నాప్ ఫిట్నెస్ ఇండియా సంస్థ సభ్యులు వెయ్యి మంది వరకు ఉండగా మరో వెయ్యి మంది ఇందులో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు బీఎం విక్రం తెలిపారు. వీరంతా నిధులతో పాటు ఉత్తరాఖండ్లో సర్వస్వం కోల్పోయినవారి కోసం ఇంటి సామగ్రి కూడా సేకరిస్తారు.
'స్నాప్ ఉత్తరాఖండ్ బెనిఫిట్ రన్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం తెల్లవారుజామున నగరం నడిబొడ్డున్నున్న ఫ్రీడం పార్కు నుంచి ప్రారంభం అవుతుంది. నగర ప్రధాన దారుల గుండా ఇది వెళ్తుంది. వందలాది మంది వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. జోగు అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి తామీ కార్యక్రమం చేస్తున్నామని, ఉత్తరాఖండ్లో తమకున్నదంతా కోల్పోయిన వారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని విక్రమ్ చెప్పారు.
తామంతా ఒక పవిత్ర ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నగరవాసులంతా సహకరించి, ఇతోధికంగా సాయపడాలని విక్రమ్ కోరారు. రన్లో పాల్గొంటున్న వారందరి నుంచి 300 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ రుసుము కూడా వసూలు చేస్తున్నారు. బెంగళూరు వాసులు ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో సహృదయంతో ఉంటారని, ఈసారి కూడా అలాగే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.