పునరావాసం.. అలుపెరగని యంత్రాంగం  | Godavari Floods 97,205 people evacuated 626 villages safe areas | Sakshi
Sakshi News home page

పునరావాసం.. అలుపెరగని యంత్రాంగం 

Published Mon, Jul 18 2022 4:12 AM | Last Updated on Mon, Jul 18 2022 4:12 AM

Godavari Floods 97,205 people evacuated 626 villages safe areas - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులు , మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో విధులు నిర్వర్తిస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీఆర్వో లక్ష్మీకుమారి

సాక్షి, అమరావతి: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి ఎగువన ఏజెన్సీ.. దిగువన లంక గ్రామాలను ముంచెత్తింది. ఇళ్ల చుట్టూ నీరు చేరి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వారం రోజులుగా అనేక చర్యలు చేపడుతూనే ఉంది. ఓ వైపు ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడం.. నిలువ నీడ లేకుండా పోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడం.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం.. ఇళ్లను వదిలి బయటకు రావడానికి ఇష్టపడకుండా మేడలు, మిద్దెలపైనే ఉంటున్న కుటుంబాలకు బియ్యం, పప్పులు, పాలు, మంచినీరు వంటి నిత్యావసర సరుకుల్ని బోట్ల ద్వారా చేరవేయడం.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కంటికి రెప్పలా కాపాడటం.. ముంపులోనూ ఇళ్లను వదిలి రానివారు అనారోగ్యం బారినపడితే అక్కడికే వెళ్లి వైద్య సేవలు అందించడం.. నెలలు నిండిన గర్భిణులను హెలికాప్టర్లలో సైతం ఆస్పత్రులకు తరలించడం.. మిగిలిన గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడం.. చివరకు లంకల్లో చిక్కుకుపోయిన పశువులను రక్షించడమే కాకుండా వాటికి కూడా ప్రత్యేక రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మేత సమకూర్చడం వంటి ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూనే ఉంది.
తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల వారిని పడవల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న విపత్తు నిర్వహణ సిబ్బంది 
 
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాల కీలకపాత్ర 
వరద బాధితులను, ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు కీలకపాత్ర పోషించాయి. అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు హెలికాప్టర్లలో వెళ్లి సహాయక చర్యలు అందించారు. కాగా, బాధితులకు 1.25 లక్షల ఆహార పొట్లాలు, సుమారు 13 లక్షల వాటర్‌ ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవికాకుండా ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు తమ పరిధిలోని బాధిత ప్రాంతాలకు రెండు పూటలా భోజనాలు పంపించారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సహాయక చర్యలు పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం అందిస్తుండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 

10,757 ఎకరాల్లో పంట నష్టం 
వరద తీవ్రతకు ఆరు జిల్లాల్లో పంటలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. 6 జిల్లాల్లో 10,757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 3,375 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 7,382 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,802 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు వరద ప్రభావానికి ధ్వంసమయ్యాయి. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 35 రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 34,749 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత అధికారులు పూర్తి స్థాయి నష్టాలను అంచనా వేయనున్నారు. 

రూ.30 కోట్ల వినియోగం  
వరద సహాయక చర్యల కోసం 6 జిల్లాల్లో అత్యవసరంగా రూ.30 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. తొలుత రూ.2 కోట్ల చొప్పున వినియోగానికి  అనుమతి ఇచ్చినా.. వరద తీవ్రత పెరగడంతో ఆ పరిమితిని పెంచారు. అల్లూరి జిల్లాలో రూ.7 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.8 కోట్లు, ఏలూరు జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేసేందుకు అత్యవసర అనుమతిచ్చారు.  

వరద హెచ్చరికలు మొదలైన నాటినుంచీ.. 
వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యంత్రాంగం అలుపెరగకుండా సహాయక చర్యలు అందిస్తోంది. ముందస్తు వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి వారం రోజులుగా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, సహాయ శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించడం, అక్కడ ఆహారం, మంచినీరు అందించడం, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం వంటి పనుల్ని యంత్రాంగం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది.

ఫలితంగానే వరద ప్రభావానికి గురైన 6 జిల్లాల్లోని 62 మండలాల పరిధిలోని 626 గ్రామాల నుంచి 97,205 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారి కోసం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రదేశాల్లో 191 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ శిబిరాల్లో 84,734 మంది తల దాచుకుంటున్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 290 గ్రామాలకు చెందిన 53,107 మంది 103 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గోదావరి మధ్యలో, గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాల్లోని గ్రామాల ప్రజలను చాలా శ్రమకోర్చి సాహసోపేతంగా ఈ శిబిరాలకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని 169 గ్రామాల నుంచి 18,707 మందిని 23 సహాయ శిబిరాలకు తరలించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని 74 లంక గ్రామాల నుంచి 9,290 మందిని 29 సహాయ శిబిరాలకు తీసుకువచ్చారు.

నిత్యావసర సరుకుల పంపిణీ  
వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 729.67 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 50 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు, 22,390 లీటర్ల పామాయిల్, 54,766 లీటర్ల పాలు, 13,564 కేజీల ఉల్లిపాయలు, 11,564 కేజీల బంగాళా దుంపలను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement