మేమున్నామని.. మీకేం కాదని.. | AP Govt Intensive relief measures in flood affected areas | Sakshi
Sakshi News home page

మేమున్నామని.. మీకేం కాదని..

Published Sun, Jul 17 2022 4:10 AM | Last Updated on Sun, Jul 17 2022 7:39 PM

AP Govt Intensive relief measures in flood affected areas - Sakshi

ఠానేల్లంకలో మేడపైకి చేరిన కుటుంబం

నట్రా సత్యవతి గర్భిణి.. పురిటి కోసం పది రోజుల క్రితం లంకాఫ్‌ ఠాణేలంకలోని పుట్టింటికి వచ్చింది. ఊహించని రీతిలో గోదావరి వరద ఇంట్లోకి వచ్చి, మోకాలు లోతున చేరింది. ఈ ఇంట్లో గర్భిణి ఉందన్న వార్త శనివారం అధికారులకు అందింది. పీహెచ్‌సీ వైద్యాధికారులు వెంటనే ప్రత్యేక బోటులో అక్కడకు చేరుకున్నారు. డాక్టర్‌ జాకబ్, వైద్య సిబ్బంది సత్యవతిని పరీక్షించారు. మందులు ఇచ్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు. గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.  ఊహించనంతగా విరుచుకుపడిన వరదతో వణికిపోతున్న లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఇది ఒక నిదర్శనం.

కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధులు వడ్డాది శీనివాసరావు, పంపాన వరప్రసాద్‌: ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతోంది. బాధిత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు అధికారులే వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. వారికి కావల్సిన నిత్యావసరాలు, వైద్య సహాయం అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన 25 బృందాలు, 1,200 మంది గజ ఈతగా>ళ్లు, మత్స్య శాఖకు చెందిన 750 బోట్లను వినియోగిస్తున్నారు. 

పక్కా ప్రణాళికతో ప్రజలకు రక్షణ 
గోదావరి వరదలో చిక్కుకున్న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు వైఎస్‌ జగన్‌ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకే వంటి ప్రత్యేక వ్యవస్థలను కూడా ఉపయోగించుకొని చక్కటి ప్రణాళిక రచించింది. గ్రామాలవారీగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది.

వలంటీర్లు, సచివాలయ, ఆర్బీకే సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి స్థితిగతులు, ఆరోగ్యం ఇతర సమాచారాన్ని నమోదు చేశారు. దీంతో గ్రామాలవారీగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికార యంత్రాంగానికి స్పష్టత వచ్చింది. ప్రణాళిక ప్రకారం ప్రజలను, మూగజీవాలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా రికార్డు స్థాయిలో వరద ముంచెత్తినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం, పశునష్టం జరగలేదు.

లంకలను విడిచి రాని వారిని కూడా కంటికిరెప్పలా చూసుకుంటూ వలంటీర్ల ద్వారా వారికి కావాల్సిన నిత్యావసరాలు, మంచినీరు, మందులు సరఫరా చేస్తున్నారు. మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, దుంపలు, లీటర్‌ వంటనూనె, పాలు, కొవ్వొత్తులు సరఫరా చేశారు. మొత్తం 3 వేల టన్నుల బియ్యం, 1.2 టన్నుల చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, వంటనూనె, 1150 లీటర్ల పాలు, 32 వేల కొవ్వొత్తులు అందించారు. 

పునరావాస శిబిరాల నిర్వహణ 
కోనసీమ జిల్లాలో 65 పంచాయతీలకు 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14, ఏలూరు జిల్లాలో 58, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 50 వేల మందిని ఈ కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. తాగునీరు, మందులు, దుస్తులు మొదలైనవి సరఫరా చేస్తున్నారు. చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు 2 లీటర్లు, ఇతర కుటుంబాలకు లీటర్‌ చొప్పున 1.40 లక్షల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. శిబిరాల్లో ఉన్న పిల్లలు, వృద్ధుల కోసం మొత్తం 33 వేల బిస్కెట్‌ ప్యాకెట్లు, 13వేల బ్రెడ్‌ ప్యాకెట్లను అందించారు. 

పూర్తి స్థాయిలో వైద్య సేవలు 
లంక గ్రామాలను ఆనుకొని ఉన్న వరద గట్ల పక్కనే ప్రభుత్వం 160 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామాల నుంచి తీసుకొస్తున్న ప్రజలకు అక్కడే ప్రాధమిక వైద్య పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరికొన్ని వైద్య బృందాలు ప్రత్యేక బోట్లలో లంక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తినీ పరీక్షిస్తున్నాయి. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వేలాది పశువులను ప్రత్యేక బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటికి సంపూర్ణ మిశ్రమదాణా, పచ్చి గడ్డిని అందుబాటులో ఉంచారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు, మందులు ఇస్తున్నారు. 

అప్రమత్తంగా అధికార యంత్రాంగం 
మరో 24 గంటలు వరద తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.  ఎగువ ప్రాంతాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తీవ్రతను అంచనా వేస్తోంది. కాలువ గట్లకు గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గట్ల వెంబడి ఇసుక బస్తాలు సిద్ధం చేసింది. ప్రత్యేక బృందాలతో గట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది.

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు 
నాకు 87 ఏళ్లు. ఎన్నో వరదలను చూశా. ఇంత పెద్ద వరద ఎప్పుడూ చూడలేదు. ఊళ్లో ఉండలేక అందరం పునరావాస కేంద్రాలకు వచ్చేశాం. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.     
– పొల్నాటి కొండమ్మ, అయినవిల్లిలంక

సత్వరమే వైద్యసహాయం అందిస్తున్నాం
లంక గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యటిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు గ్రామాల్లో 5,063మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. 
– డాక్టర్‌ ఎస్‌.జాకబ్, కొత్తలంక పీహెచ్‌సీ వైద్యుడు

పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం 
వరద ఇంత వస్తుందని ఊహించలేదు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి నీరు చొచ్చుకు రావడంతో ఆందోళన చెందాం. అధికారులు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం. 
– అంగాడి ముత్యాలరావు, లంకాఫ్‌ ఠానేలంక 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement