
కరుణ అభయం
వరద బాధితులకు తాను ఉన్నానన్న అభయాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చారు. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయకాల పంపిణీ వేగవంతం చేయాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, చిదంబరంలో జోరు వానలోనూ బాధితుల్ని డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పరామర్శించారు.
సాక్షి, చెన్నై : వరద బాధితుల సహాయార్థం డీఎంకే వర్గాలు సహాయక చర్యల్లో దూసుకెళుతున్నారు. పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయం అరివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి లారీలు, ఇతర వాహనాల్లో సహాయకాలు వచ్చి చేరుతున్నాయి. వీటన్నింటిని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు. ఈ పనుల్ని దగ్గరుండి మరీ కరుణానిధి పరిశీలిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించారు. వీల్ చైర్‌లో ఉన్న కరుణానిధి తన వాహనం నుంచి వరద బాధిత ప్రాంతాల్ని పర్యటించారు.
ఆయా ప్రాంతాల్ని పరిశీలిస్తూ, తొలుత చింతాద్రి పేటలోని నెడుంజెలియన్ నగర్‌లో పర్యటించారు. అక్కడి బాధితులకు తాను ఉన్నాన్న అభయాన్ని ఇచ్చారు. సహాయకాలను ఇంటింటికి తీసుకెళ్లి చేర్చాలని అక్కడి పార్టీ వర్గాలను ఆదేశించారు. తదుపరి ఆ పరిసరాల్లో సహాయకాలను డీఎంకే వర్గాలు పంపిణీ చేశాయి. అనంతరం సైదాపేట మరై మలై అడిగళార్ వంతెన వద్ద నుంచి దెబ్బ తిన్న ప్రాంతాల్ని పరిశీలించారు. అక్కడి నుంచి అడయార్ , కోట్టూరు పురంలలో పర్యటించి బాధితుల్ని ఓదార్చారు.
త్వరితగతిన ఇంటింటికి సహాయకాలను అందించాలని ఆయా ప్రాంతాల్లోని నేతల్ని ఆదేశించారు. ఇక, తన పర్యటనలో భాగంగా కడలూరులో బుధవారం ఎంకే స్టాలిన్ పర్యటించారు. చిదంబరంలో జోరు వానలోనూ ముందుకు సాగుతూ బాధితుల్ని పరామర్శించారు. సహాయకాలను అందజేశారు. సోత్తుపాడి, కురింజి పాడి మీదుగా కడలూరులో ఆయన పర్యటన సాగింది.