
శ్రీనగర్: అమర్‌నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్‌తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు.
11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్‌నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది.