కాశ్మీర్ ప్రజలకు హెచ్చరికలు
శ్రీనగర్: కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం మరోసారి వరద ముప్పు హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జీలం నది సాధారణ స్థాయిని మించి ఉధృతరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో లోతట్టు, లోయ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎత్తైన ప్రాంతాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలాలని హెచ్చరించింది.
సాధారణ స్థాయిని మించి ప్రస్తుతం జీలం నది ప్రవాహం 19.10 అడుగుల మేర ఉందని అధికారులు తెలిపారు. కాగా, అనంతనాగ్ జిల్లాలోని సంగం ఏరియాలో 22.30 అడుగులకు చేరి జీలం ప్రవహిస్తుందని ఇది ప్రమాదకరమని ప్రభుత్వం తెలిపింది. గత రెండు రోజులుగా కాశ్మీర్లో కాస్త అయిన తెరపునివ్వకుండా వర్షం పడుతోంది.