వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్‌ | CM YS jagan Review On Flood Relief Measures In AP | Sakshi
Sakshi News home page

వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్‌

Published Wed, Nov 24 2021 12:47 PM | Last Updated on Thu, Nov 25 2021 12:39 PM

CM YS jagan Review On Flood Relief Measures In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని సీఎం పరిశీలించారు. నిత్యవసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు.
చదవండి: ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

అనంతరం అంశాల వారీగా వరద నష్టం నివేదికలను– సహాయ చర్యల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా చేశామని కలెక్టర్లు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయని తెలిపారు. ఈ సాయంత్రంలోగా వీరికి కూడ నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం దాదాపుగా అందిందని వివరించారు. సహాయక శిబిరాల నుంచి ప్రజలంతా తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు.
చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా?

కడపలో 155 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలిగితే.. అన్నింటికీ పునరుద్ధరించామని కలెక్టర్‌ పేర్కొన్నారు.  ఈ  ప్రాంత సీఎండీ ఇక్కడే ఉండి... విద్యుత్తును పూర్తిగా పునరుద్ధించారని పేర్కొన్నారు. నిన్న మళ్లీ భారీ వర్షం కారణంగా 8 ఆవాసాలకు మాత్రమే విద్యుత్తు పునరుద్ధరణలో ఇబ్బందులు వచ్చాయని, ఈరోజు పునరుద్ధరిస్తామన్నారు.  అన్ని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నామని,  ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు.  రాజంపేటలో 36 బోర్లు వేసి.. వాటిద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 
చదవండి: నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్‌

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫైర్‌ టెండర్లతో ప్రతి ఇంటినీ క్లీన్‌ చేస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ వరదల కారణంగా మరణించిన వారికి నష్టపరిహారాన్ని కూడా శరవేగంగా అందించామని కలెక్టర్లు తెలిపారు. మృతదేహాలు లభ్యమైన కుటుంబాలకు వెంటనే అందించామని చెప్పారు. గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో ఎఫ్‌ఐఆర్, పంచనామాలు పూర్తిచేస్తున్నామని తెలిపారు.

సహాయ చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు..
దాదాపు 95 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితం అయ్యాయని, ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సహాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.  కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. తాగునీటి విషయంలో అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ..
►రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి.
►తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు.
►తాగునీటి అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి.
► ప్రతిరోజూ కూడా వ్యక్తిగతంతా కలెక్టర్లు పర్యవేక్షించాలి.

►104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే రెస్పాండ్‌ కావాలని సీఎం ఆదేశం
► శానిటేషన్‌మీద బాగా శ్రద్ధ పెట్టాలి.
►కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
►104 నంబర్‌ను బాగా ప్రచారం చేయాలి.
►ఎవరికైనా ఏదైనా అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలి, వారికి సహాయాన్ని అందించాలి.

పశునష్ట పరిహారమూ అందించాలి
►చనిపోయిన పశువులకు వెంటనే పరిహారం అందించాలి.
►పశువులకు వాక్సినేషన్‌ చేయాలి.
►పశువుల దాణా కూడా పంపిణీచేయాలి.

పూర్తిగా దెబ్బతిన్నవారికి కొత్త ఇళ్లు
►పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలి.
►వచ్చే 3–4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలి.
►అంతేకాక పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలి.
► వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలి.
►దీనివల్ల వారు వెంటనే పనులు ప్రారంభించగలుగుతారు.

పంట నష్టపరిహారం
► పంట నష్టహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్‌ చురుగ్గా సాగాలి.
►రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలి.
►ఈ నివేదికలు ప్రకారం వెంటనే ప్రణాళికలు వేసి పనులు ప్రారంభించాలి.
►ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులను మంజూరుచేయాలి.
►నెలరోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలి.
►కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూసుకోవాలి.
►ఈలోగా రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలి.
►చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుకావాలి.

2017లో అన్నమయ్య ప్రాజెక్టు నివేదికను పట్టించుకోలేదు
►గతంలో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదికలను పట్టించుకోలేదు.
►చెయ్యేరు ప్రాంతంలో గతంలో ఉన్నడూలేని విధంగా వరద వచ్చింది.
►పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరదనీరు వచ్చింది.
►అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్‌ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు  మాత్రమే విడుదల చేయగలదు, అప్పుడు  అలానే డిజైన్‌ చేశారు
►కాని దురదృష్టవశాత్తూ 3.2 లక్షల క్యూసెక్కులనీరు వచ్చింది.
►2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారు.
►ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు పట్టించుకోలేదు.
►పింఛా విడుదల సామర్థ్యం 58వేల క్యూసెక్కులు అయితే, 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.
►దీనిపై ఉన్న అన్ని వాగులు, వంకలు కూడా ఎప్పుడూలేని విధంగా వరదనీరు వచ్చింది.
►ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరద వచ్చింది.
►చెయ్యేరు వెంబడికూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.
►భవిష్యత్తులో ఇలాంటి వరద వస్తుందని అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి.
► ప్రస్తుతం వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని.. అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలి, రీ డిజైన్‌చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు

ఇరిగేషన్ ప్రాజెక్టులపై తక్షణ నివేదిక
►13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండి.
►డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయండి.
►ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలి.
►ఉదాసీనత వల్ల ఇప్పటివరకూ పెండింగులో ఉన్న డ్యాంల భధ్రతపై దృష్టిపెట్టండి.
►అన్నమయ్య లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదు.
►దీనికోసం అన్ని చర్యలూ తీసుకోవాలి.

26 నుంచి వర్షాలు –అప్రమత్తత
►ఈనెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి:
►27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు:
►భారీ వర్ష సూచనపై కలెక్టర్లకు నివేదికలు పంపించండి: సీఎం
►తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

సమీక్షా సమావేశానికి సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనంతపురము జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణ, వైయస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ వి విజయరామరాజు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్‌లు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement