
సాక్షి, అమరావతి: తక్షణమే వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించి బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, వారి ప్రాంతాల్లోనే సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పట్టణాల్లో పారిశుధ్యం, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున రేషన్ సరుకుల పంపిణీ చేపట్టడంతోపాటు నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలని సూచించారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి సాగు చేపట్టేలా విత్తనాలు, తదితరాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment