
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో విజయవాడ వరద ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలోని రేపటి నుంచి రెండు రోజుల పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. సుమారు 50వేల కుటుంబాలకు బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు కలిసిన ప్యాకెట్‌ను అందించనున్నారు.
రేపు 30 వేల నిత్యవసర వస్తువుల ప్యాకెట్లను, ఎల్లుండి మరో 20 వేల నిత్యవసర వస్తువుల ప్యాకెట్లను వరద బాధితులకు అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం విజయవాడ హనుమాన్ పేటలో.. వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జి ఆసిఫ్ ఇతర నేతలు పరిశీలించారు.
వరద బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. గత మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని వితరణగా అందించారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుపై వైఎస్ జగన్ ఆగ్రహం