ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | Ys Jagan Fire On Chandrababu About State Government School Education | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published Mon, Sep 16 2024 6:02 PM | Last Updated on Mon, Sep 16 2024 8:48 PM

Ys Jagan Fire On Chandrababu About State Government School Education

సాక్షి,తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో చంద్రబాబు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని విమర్శించారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.  

‘చంద్రబాబు.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?

దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్‌, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది.

మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు.  మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ “ఈనాడు’’ కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు.
 

పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన

మన ప్రభుత్వ స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎందులోనూ తక్కువకాదు చంద్రబాబుగారూ? వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు.  అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియెంటేషన్‌. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు.

పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’అని ట్వీట్‌లో వైఎస్‌జగన్‌ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి : మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement