కూటమి కొత్త స్టంట్స్‌ | YS Jagan Mohan Reddy anger over parents committee meeting | Sakshi
Sakshi News home page

కూటమి కొత్త స్టంట్స్‌

Published Mon, Dec 9 2024 4:45 AM | Last Updated on Mon, Dec 9 2024 7:17 AM

YS Jagan Mohan Reddy anger over parents committee meeting

పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చే యత్నం 

ఇంతటి నటనా కౌశలం సీఎం చంద్రబాబుకే సొంతం 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు

టీచర్లు–విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా జరిగాయి 

తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే నాడు–నేడు పనులు 

ఈ సమావేశాలకు ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఏమార్చే యత్నం 

విద్యా రంగాన్ని నాశనం చేయడమేకాక ఈ సమావేశాలకు చందాలు అడుగుతారా?.. అమ్మ ఒడి గురించి సీఎం, 
డిప్యూటీ సీఎం, లోకేశ్‌.. ఎందుకు మాట్లాడటం లేదు? 

ఇంగ్లిష్‌ మీడియం, టోఫెల్, సబ్జెక్ట్‌ టీచర్ల విధానం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్, ట్యాబ్‌లు.. ఎందుకు ఆపేశారు?..మధ్యాహ్న భోజనం బాగోలేదని పేరెంట్స్‌ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించ లేదా?  

స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణ గురించి ఎందుకు పట్టించుకోలేదు?  

విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా డైవర్షన్‌ రాజకీయాలా?

సాక్షి, అమరావతి : సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలేవో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్ర­బాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యా రంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ.. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్‌ సమావేశాలపై పబ్లిసిటీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. 

ఈ ప్రపంచంలో ఒక్క చంద్ర­బాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలర­న్నారు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం అంటూ వ్యంగో­క్తులు విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

టీచర్లు–విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుంచీ జరుగుతున్నవే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 

15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు–నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్‌ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ ఫండ్, స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. 

ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్‌ పెట్టి, ఓవైపు విద్యా రంగాన్ని నాశనం చేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. పేరెంట్స్‌ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్‌ పంపడం. మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు ఇచ్చాం.  

నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30 వేలు.. ముగ్గురుఉంటే రూ.45 వేలు.. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంత మంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. 

ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా.. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయక పోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్‌ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రిగా లోకేష్‌ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగా చేయడం కాదా? ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?

గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్‌ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబు గారూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్క మాడుస్తున్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. 

పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌ ఈ రోజు ఏమైంది? టాయిలెట్ల మెయింటెనెన్స్‌ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్‌ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా?  

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యా రంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రుల ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా?

అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్సార్‌సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలి దశలో మిగిలిపోయిన నాడు–నేడు  పనులను ఉద్దేశ పూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్‌ఈ  అఫిలియేషన్‌ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్‌ఈని ఎందుకు రద్దు చేశారు? ఇంగ్లిష్‌ మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు? 

ప్రపంచ స్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారు చేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశ పెట్టిన టోఫెల్‌ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల విధానం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్‌ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్‌ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దు చేశారు? 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దు చేశారు?

మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులో,  ప్రతి స్కూల్‌లో పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్, డిజిటల్‌ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్‌ ఇయర్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేల మంది ఇంజినీరింగ్‌ స్టూడెంట్లకు వచ్చే ఉపాధి పోతుంది కదా? ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ మెయింటినెన్స్‌ మూలన పడదా?

విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన.. ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్‌  రాజకీయం  కాదా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement