పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ చర్యలు
విద్యా సమీక్ష కేంద్రాల బాధ్యతలన్నీ తగ్గించిన ప్రభుత్వం
ఉపాధ్యాయుల హాజరు మినహా 7 మాడ్యూల్స్ నిలిపివేత
విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన నిర్వహణ గాలికి..
సాక్షి, అమరావతి: గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన సర్కారు విద్యను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చక్కదిద్దారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పాఠశాలలను రూపుదిద్దారు. ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన ఉచిత ఇంగ్లిష్ మీడియం విద్యను అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలల్ని తిరిగి నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 44,617 ప్రభుత్వ పాఠశాలలు, 14 వేల ప్రైవేటు స్కూళ్లలో పరిస్థితులపై పర్యవేక్షణకు 2022లో ఏర్పాటు చేసిన ‘విద్యా సమీక్ష కేంద్రాల (వీఎస్‌కే)’ లను నిర్వీర్యం చేస్తోంది. ఉపాధ్యాయుల అటెండెన్స్ మినహా మిగిలిన అన్ని విధుల నుంచి ఈ కేంద్రాలను తప్పించింది.
జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో పలు పథకాలు, సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ డేటా ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం 2022లో ‘విద్యా సమీక్ష కేంద్రాల (కమాండ్ కంట్రోల్ సెంటర్)’ను అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో రెండు వీఎస్‌కేలు ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వమే ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తోంది. ఈ కేంద్రాల్లో విద్యకు సంబంధించి 8 మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసి పర్యవేక్షించడంతో పాటు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ (ఆరీ్టజీ)తో అనుసంధానించారు.
టీచర్లు, విద్యార్థులు హాజరు, మధ్యాహ్న భోజనం, కన్సిస్టెంట్ రిథమ్స్ (సీఆర్), యూడైస్, అకడమిక్ మానిటరింగ్, పరీక్షల మూల్యాంకనం వంటి అంశాలను డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తుంటారు. పాఠశాలల్లో విధులపై పూర్తి అవగాహన ఉన్న ఉపాధ్యాయులను జిల్లాకు ఇద్దరు చొప్పున డెప్యుటేషన్‌పై నియమించి, రెండు సెంటర్లలోనూ నలుగురు చొప్పున పర్యవేక్షకులుగా నియమించారు. ఎంతో కీలకమైన ఈ విభాగంలో విధులను పొరుగు సేవల సిబ్బంది అప్పగిస్తే లక్ష్యం నెరవేరదన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థి బడికి రాకపోయినా, టీచర్ అటెండెన్స్ వేయకపోయినా లేదా సెలవు లేకుండా పాఠశాలలో లేకపోయినా వీఎస్‌కేలోని సిబ్బంది హెచ్‌ఎంతో పాటు ఎంఈవో, డీఈవోలకు సమాచారం ఇస్తారు. వరుసగా 3 రోజులు విద్యార్థి హాజరు కాకపోతే నేరుగా తల్లిదండ్రులకే మెసేజ్ చేయడంతో పాటు స్థానిక సచివాలయంలోని సిబ్బందికి విషయం చెప్పి ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. రోజూ మధ్యాహ్న భోజనం ఎంత మంది తీసుకుంటున్నారన్న వివరాలు నమోదు చేసి, లోటుపాట్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దేలా చేస్తారు.
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కేంద్రాలకు ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరు మినహా మిగతా 7 అంశాలపై పర్యవేక్షణను ప్రభుత్వం తొలగించింది. గతంలో మండల, జిల్లా విద్యా శాఖ అధికారులు వారంలో రెండు సార్లు చేసే తనిఖీలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాఠశాలల్లో ఏం జరుగుతోందో ఉన్నతాధికారులకు తెలియడంలేదు. పర్యవేక్షణ లేక స్కూళ్లల్లో పరిస్థితి దారుణంగా తయారైంది.
గ్రామ స్థాయి నుంచే వ్యవస్థల నిర్వీర్యం
గత ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో విద్యా సంబంధ అంశాలు కూడా సంబంధిత మంత్రి, కార్యదర్శి, కమిషనర్ వరకు తెలిసేలా డ్యాష్ బోర్డును అభివృద్ధి చేశారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో చర్యలు తీసుకునేవారు. గ్రామ, వార్డు పరిధిలో ఎంత మంది పిల్లలున్నారు, ఏ స్కూళ్లల్లో ఏ తరగతులు చదువుతున్నారో పూర్తి సమచారం ఉండేది. బడి ఈడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్ఫించే బాధ్యతను వలంటీర్లు, వార్డు విద్యా కార్యదర్శి, గ్రామ సచివాలయం విద్యా సంక్షేమ సహాయకులు తీసుకున్నారు.
ఇప్పుడు వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. వీరికి వారానికి రెండు రోజులు పాఠశాలల్లో టాయిలెట్ల శుభ్రతపై ఫొటోలు అప్‌లోడ్ చేసే పని అప్పగించింది. మధ్యాహ్న భోజనంపైనా పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని ఆహారం తినలేక విద్యార్థులు ఇంటి నుంచే ఆహారం తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి0ది.
Comments
Please login to add a commentAdd a comment