
నిరసన సెగ
పాలకొండ రూరల్/పాలకొండ/వీరఘట్టం:తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులకు వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. పర్యటనకు అడుగడుగునా అంతరాయం కలిగిలింది. రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకున్నా కనీసం ఆదుకునేవారే లేరని, కాసిన్ని బియ్యం గింజలు కూడా అందజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం పరిశీలనలో అధికార పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారంటూ నిలదీశారు. కాన్వాయ్‌ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖామంత్రి కె.రవీంద్రలు పాలకొండలోని గారమ్మకాలనీ, గోపాలపురం, వీరఘట్టం మండలంలోని కంబర తదితర వరద బాధిత ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. కంబర వద్ద మంత్రులను మహిళలు అడ్డుకున్నారు. పంట నష్టం గుర్తింపులో వివక్ష చూపుతున్నారంటూ రైతులు కాన్వాయ్‌లను అడ్డుకున్నారు. మంత్రులను నిలదీశారు. పాలకొండ మండలం గారమ్మకాలనీకి విద్యుత్ సరఫరా చేయలేదంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి గోపాలపురం చేరుకున్న మంత్రులు రోడ్డుపైనుంచే పరిశీలన పూర్తి చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద కొండాపురం గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు.
పకటనలతో సరిపెడుతున్నారని, తక్షణసాయంగా కనీసం బియ్యం కూడా అందించలేదని నిలదీశారు. మంత్రులు కాన్వాయ్ దిగకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళలు కాన్వాయ్ ముందు బైఠాయించారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు తోడవ్వడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులను నెట్టేసేందుకు ప్రయత్నించారు. అరుుతే, మంత్రులు సమాధానం చెప్పేవరకు కదిలేది లేదని చెప్పడంతో చేసేది లేక మంత్రి అచ్చెన్నాయుడు మాత్రమే కారు దిగి బాధితులకు సమాధాన పరిచారు. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతజరుగుతున్నా వ్యవసాయ, ఎక్సైజ్ శాఖామంత్రులు వాహనాలను కూడా దిగకపోవడం విశేషం. దీనిపై బాధితులు మరింత అక్రోశం వెల్లగక్కుతూ నినాదాలు చేశారు. వీరితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదరరావు, ఎంపీపీ ప్రతినిధి వారాడ సుమంత్‌నాయుడు, ఎస్టీసెల్ కన్వీనర్ నిమ్మక పాండురంగతో పాటు స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాలింతకు ఎదురుచూపే...
ఇటీవల వరదలో కొట్టుకుపోయిన టి.గణేష్ భార్య సరోజనికి రూ.5 లక్షల చెక్కు అందజేస్తామని ఉదయం నుంచి అధికారులు హడావిడి చేశారు. నెల రోజులైన బాలింతను ఆర్డీవో కార్యాలయం వద్ద గంటల తరబడి ఉంచారు. సాయంత్రం వరకు ఆమె ఎదురు చూసినా చెక్ మాత్రం అందజేయలేదు. దీంతో ఆమె నిరాశతో ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. మంత్రులు కాన్వాయ్ దిగకపోగా, బాధితురాలిని శ్రీకాకుళం వచ్చి చెక్కు తీసుకోవాలని సూచించడం గమనార్హం.