ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాలు, వరద ముప్పుతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న సమయంలో అధికార యంత్రాంగం మొత్తం హైదరాబాద్ బాట పట్టింది. వీరు వెళ్లింది అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకో లేక వ్యక్తిగత పనులకో అనుకుంటే పొరపాటే. మున్సిపల్‌శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొనేందుకేనట! పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు అధికారులు అధిక ఆసక్తి చూపారు. మూడు రోజుల నుంచి వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతుంటే అదేమీ పట్టని అధికారులు హైదరాబాద్ బాటపట్టారు.
ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు,జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో బుధవారం తీవ్ర వరద ముప్పు నెలకొంది.
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేరు. ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్‌తో సహా పలువురు సాంకేతిక సిబ్బంది, కందుకూరు మున్సిపల్ కమిషనర్ ఆయన సిబ్బంది హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నగర కమిషనరైతే కనీసం ఫోన్లో కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. జిల్లాలో కలెక్టర్ మినహా దాదాపు రెవెన్యూ సిబ్బందిదీ ఇదే పరిస్థితి. ఒంగోలు ఆర్డీఓ సైతం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తహసీల్దార్‌లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.. మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బంది సమ్మెలో ఉన్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.