తమిళి సైతో కలిసి పీయూష్ ప్రచారం
* పీయూష్ సంచలన వ్యాఖ్య
* 1400 కోట్లు మింగేసినట్టు ఆరోపణ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారుపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ మరో మారు సంచలన ఆరోపనలు చేశారు. కేంద్రం ఇచ్చిన వరద సాయం రూ.రెండు వేల కోట్లలో రూ. 1400 కోట్లను అన్నాడీఎంకే సర్కారు స్వాహా చేసిందని ఆరోపించారు. గోయల్ ఇటీవల రాష్ర్టంలో వార్తల్లో వ్యక్తిగా అవతరించి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జయలలితను ఒక కేంద్ర మంత్రిగా తాను సంప్రదించ లేని పరిస్థితి ఉందని, ఉదయ్ పథకం అమలు చేయని దృష్ట్యా, ఆ రాష్ట్రానికి కోట్లు నష్టం అవుతోందంటూ ఇటీవల తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆయన బాటలో పలువురు మంత్రులు అనుసరించారు.
సీఎం అనుమతి కరువు కావడంతో, పోయేస్ గార్డెన్‌కు పరిమితమైన జయలలితపై విసుర్లు, విమర్శలు బయలు దేరాయి. పీయూష్ చేసిన వ్యాఖ్యలు నేటికి చర్చనీయాంశంగానే ఉన్నాయి. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని పదే పదే పీయూష్ స్పందిస్తూనే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం సీఎం జయలలిత ఎన్నికల బరిలో ఉన్న ఆర్కేనగర్ వేదికగా మరో సంచలన ఆరోపణలు చేశారు. అక్కడి బీజేపీ అభ్యర్థి ఎంఎన్ రాజకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పీయూష్ ఓపెన్ టాప్ వాహనం నుంచి ప్రసంగిస్తూ సీఎం జయలలిత సర్కారుపై విరుచుకు పడ్డారు.
వరద సాయం స్వాహా : ఉదయ్ పథకం వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నాని స్పందిస్తూ, తన ప్రసంగాన్ని సాగించారు. చెన్నైను వరదలు ముంచెత్తిన సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ తల్లడిల్లారని, తక్షణం ఆయన చెన్నైకు రావడమే కాకుండా రూ. వెయ్యి కోట్లను సాయంగా ప్రకటించారన్నారు. అంతకు ముందుగా వరదసాయం నిమిత్తం రూ. 900 కోట్లకు పైగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం నుంచి వరద సాయంగా రూ. రెండు వేల కోట్ల వరకు నిధులు మంజూరు అయ్యాయని, అయితే, అవన్నీ బాధితులకు మాత్రం చేర లేదని ఆరోపించారు.
60 శాతం మేరకు బాధితులు ఇంకా కష్టాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కేవలం రూ. 600 కోట్లను మాత్రం వెచ్చింది. మిగిలిన 1400 కోట్లను స్వాహా చేసి ఉన్నారని, ప్రజాల సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు నిచ్చారు. ఆర్కేనగర్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి, జయలలితకు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. ముందుగా విరుగంబాక్కం ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరాజన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. విరుగంబాక్కం అభివృద్ధికి తానుచేపట్టబోయే కార్యక్రమాల్ని వివరిస్తూ తమిళి సై రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేశారు.