పేర్ల నమోదులో జాగ్రత్త వహించండి | Beware of flood victims Names to enroll, says B venkatesham | Sakshi
Sakshi News home page

పేర్ల నమోదులో జాగ్రత్త వహించండి

Published Wed, Oct 30 2013 2:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Beware of flood victims Names to enroll, says B venkatesham

గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయడంలో జాగ్రత్తలు వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి బి.వెంకటేశం అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వరద నష్టంపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ఏ రైతు నుంచీ జాబితాలో తనపేరు నమోదు కాలేదన్న ఫిర్యాదు రాకూడదన్నారు. ఎటువంటి ఒత్తిడులకు లొంగరాదన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి పంట, గృహాలు కోల్పోయిన వారి జాబితా తయారు చేయాలన్నారు. వారం రోజుల్లో జాబితా అందిస్తే దానిపై ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు.
 
 జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి..
 జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో 16 నుంచి 18 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందన్నారు. ఈ కారణంగా పంటలు, గృహాలు, పశువులు కోల్పోయిన రైతుల బాధితుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. జాబితాను గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.  ముంపు ప్రాంతాలలో పారిశుధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాలపై స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా  విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారంకంటే ఎక్కువగా నీటిలో ఉన్న గృహాలకు చెందిన కుటుంబాలకు దుస్తులు, వంట పాత్రల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 5వేలు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. 5వ తేదీ లోపు చేనేత, మత్య్సకారుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నారు. ఇటీవల రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పెదనందిపాడు పర్యటనకు వచ్చిన సమయంలో గైర్హాజరైన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈవోపీఆర్డీ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
 రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు..
 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవవం సందర్బంగా స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల సవ రణ కార్యక్రమానికి సంబంధించి స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాలను ఈనెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. నవంబరు 1వ తేదీ నుంచి ఓటర్ల సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డిఆర్వో కె.నాగబాబు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఆర్డీవోలు బి.రామమూర్తి, ఎస్.శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
 
 వరదలకు పంట నష్టపోయిన రైతులకు  పరిహారం అందాలంటే పంట సాగు చేస్తున్న రైతు పేరు మాత్రమే నమోదు చేయాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. వచ్చేనెల 14 నుంచి 19వ తేదీ వరకూ 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్ట వలసి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement