
సాక్షి,హైదరాబాద్: గతేడాది సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ వాసులకు వరద సాయం ఎప్పుడిస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అయిపోగానే బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల నగదు సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ‘రాత్ గయి బాత్ గయి’తరహాలో రూ.10వేలు నగదు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత బాధితులను గాలికొదిలేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
వరద సాయం పొందిన వారి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టి పారదర్శకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని దాదాపు 5 లక్షల మంది గతేడాది అక్టోబర్ నుంచి వరదసాయం కోసం ఎదురుచూస్తున్నారని, దీన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు రూ.200 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయని, ఈ పరిహారాన్ని కూడా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. 8 నెలల క్రితమే వరదలు ముంచెత్తి నష్టాన్ని కలిగించినా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదో, ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆ లేఖలో కోరారు. డ్రైనేజీ వ్యవస్థ, నాలాల విస్తరణ, మ్యాన్‌హోల్స్, ఓపెన్‌నాలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment