టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగానికి భరోసా కల్పించేందుకు టీజేఏసీ సిద్ధమవుతోంది. కరువుతో ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ఆ యాత్ర తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన బుధవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. జేఏసీ వర్గాల ప్రకారం.. ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈనెల 10న ట్రాన్స్‌కో అధికా రులు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహ రించుకోవాలని తీర్మానించారు. ట్రాన్స్‌కో ఉద్యోగులెవరూ సంస్థ విషయాలపై బహిరంగంగా మాట్లాడొద్దని, మీడియాకు సమాచారం ఇవ్వొద్దని, కార్యాలయాల్లోకి మీడియాను అనుమతించవద్దంటూ జారీ చేసిన ఈ సర్క్యులర్ రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధమని టీ జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఛత్తీస్‌గడ్ విద్యుత్ ఒప్పందంపైనా పూర్తిస్థాయి చర్చ జరగాలనే అంశంపై, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యుత్ జేఏసీ నేత రఘు బదిలీపైనా చర్చించారు. ఒక వ్యక్తికోసం జేఏసీ పోరాడ డమని కాదుగానీ, తెలంగాణ కోసం ఉద్యమించిన నేతగా, ఉద్యోగ సంఘాలు ఆయన బదిలీపై స్పందిస్తే మద్దతుగా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చారు. భేటీలో జేఏసీ కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, నేతలు రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, విజేందర్‌రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు.