
కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం
సురవరం ధ్వజం
► 16నుంచి రౌండ్‌టేబుల్ సమావేశాలు.. అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర: చాడ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారి, యథేచ్ఛగా దోచుకునేందుకు అవకాశం కల్పించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రం అవినీతి తెలంగాణగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సీపీఐ రాష్ట్ర శాఖ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సదస్సు నిర్వహించింది. అబద్ధాలు ప్రచారం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం కేసీఆర్ మించిపోతున్నారని ఎద్దేవా చేశారు.
బంగారు తెలంగాణ అంటే రైతులను పట్టించుకోకుండా ఉండటమా.. రోడ్లు దారుణంగా ఉండటమా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల రాష్ట్రం గా ముందుకి వెళుతోందని, అప్పుల తెలం గాణగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేపడతామన్నారు.
జీఎస్టీతో చిన్న పరిశ్రమలకు దెబ్బ
జీఎస్టీతో చిన్న పరిశ్రమలు దెబ్బ తిన్నాయని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం చేసే యాత్రకు జేఏసీ మద్దతు ఉంటుందని, సామాజిక నాయ్యం కోసం అందరినీ కలుపుకొని పోవాలని, అభివృద్ధి కోసం ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, నెరెళ్లలో దళితులపై దాడి దారుణమని విమలక్క పేర్కొన్నారు.
నేరెళ్ల ఘటనతో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. 60 ఏళ్ల పోరాట ఫలితాలను సీఎం కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారా యణ ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 17 చోట్ల దళితులపై దాడులు జరిగాయన్నారు. ఎంపీ కవితకు కేంద్రమంత్రి పదవి కోసం సీఎం కేంద్రానికి దాసోహం అయ్యాడని విమర్శించారు. కేసీఆర్ నియంత పాలనపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.