సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్‌బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్యావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులనైతే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు సీఎం జగనన్న దగ్గరకు వెళ్తే పనులు అవుతున్నాయనడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అదే వీడియోలో జగనన్న స్ఫూర్తితో తామంతా ముందుకెళ్తున్నామని చెప్పానని, మరి వాటిని ఎల్లో మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని నిలదీశారు.
దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని రామోజీని ప్రశ్నించారు. తప్పుడు రాతలు ఆపకుంటే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చించివేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తా
రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో తానేదో భారీ స్థాయిలో భవిష్యత్తు ఊహించి రాలేదని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలని కోరుకున్నట్లు చెప్పారు. జగనన్న తనను సొంత చెల్లెలు మాదిరిగా చూసుకున్నారని తెలిపారు. జగనన్న ఆదేశిస్తే ఎలాంటి పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని, తన సీటును వదులుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రకటించారు.
దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా ఎస్సీలకు సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే పని చేస్తానని తెలిపారు. తనను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు చేస్తే ఏ స్థాయి వ్యక్తికైనా తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలతో దిగజారిపోతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment