ఓటర్లను ప్రభావితం చేయలేరు: భన్వర్‌లాల్ | Nobody Can affect voters, says Bhanwar lal | Sakshi
Sakshi News home page

ఓటర్లను ప్రభావితం చేయలేరు: భన్వర్‌లాల్

Published Fri, Apr 18 2014 2:12 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఓటర్లను ప్రభావితం చేయలేరు: భన్వర్‌లాల్ - Sakshi

ఓటర్లను ప్రభావితం చేయలేరు: భన్వర్‌లాల్

ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
 డబ్బు, మద్యంతో వారి అభిప్రాయాన్ని మార్చలేరు
పార్టీలు, అభ్యర్థులు అలాంటి తప్పుడు చర్యలను మానాలి
డబ్బు ఇచ్చినా.. తీసుకున్నా క్రిమినల్ కేసులు పెడతాం
దేశవ్యాప్తంగా రూ. 265 కోట్లు స్వాధీనం.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 103 కోట్లు

 
సాక్షి, హైదరాబాద్:
ఎన్నికల్లో ఓటెవరికి వేయాలో ఓటర్లందరికీ తెలుసని, డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్ల అభిప్రాయాన్ని మార్చలేరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బుల పంపిణీ వంటి తప్పుడు చర్యలను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులిచ్చిన వారితో పాటు తీసుకున్న వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
 
 రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల బ్యాలెట్ పత్రాల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మొదట పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే కంపార్ట్‌మెంట్ ఉంటుందని, ఇక్కడ వినియోగించే ఈవీఎంపై తెలుపు రంగు బ్యాలెట్ ఉంటుందన్నారు. అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసేందుకు కేటాయించే రెండో కంపార్ట్‌మెంట్‌లో వాడే ఈవీఎంపై గులాబీ రంగు పత్రం ఉంటుందని ఆయన వివరించారు.
 
 ఈ విషయాన్ని వివరిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద పోస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురువారం సచివాలయంలో ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధులు, సాయంత్రం బ్యాంకుల ప్రతినిధులతో భన్వర్‌లాల్ సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, అక్రమ నగదు పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 ఆయన ఇంకా ఏమన్నారంటే..
  ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నిరోధించేందుకు గట్టి చర్యలను చేపట్టాం. బ్యాంకుల నెట్‌వర్క్ ద్వారా అకౌంట్లకు డబ్బులు బదిలీ అవుతున్నాయి. ఈ డబ్బును ఏటీఎంల ద్వారా డ్రా చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇటీవ లే కొన్ని బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా భారీగా డబ్బులు జమయ్యాయి. జిల్లాల్లో కొన్ని ఏటీఎంల నుంచి విత్‌డ్రాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల లావాదేవీలను పరిశీలించాలని ఈసీ నిర్ణయించింది. బ్యాంకుల ప్రతినిధులందరూ ఎన్నికల సమయంలో లావాదేవీలపై సమాచారాన్ని పంపిస్తారు. దాని ఆధారంగా డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయో విశ్లేషిస్తాం. డబ్బులు ఇచ్చిన.. తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తాం. కొంత మంది ఓటర్లకు కూపన్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటి ద్వారా ఓటర్లకు మిక్సీలు, గ్రైండర్ల వంటివి ఇస్తున్నారు. కూపన్లు ఎవరు కొంటున్నారు, వాటికి ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారనే విషయంలో దుకాణాలపై నిఘా పెట్టి సంబంధితులపై కేసులు నమోదు చేస్తాం.
 
  ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై రాష్ట్రం బదనాం అయిపోయింది. చాలా బాధాకరం. దేశంలో ఇప్పటి వరకు రూ. 265 కోట్లు స్వాధీనం చేసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 103 కోట్లు దొరికాయి. 79 కేజీల బంగారం, 300 కేజీల వెండితో పాటు 3.76 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నాం. 19,043 ఆయుధాల లెసైన్స్‌లు డిపాజిట్ చేశారు.
  డబ్బు, మద్యం పంపిణీ నిరోధించేందుకు తటస్థులతో పాటు యువత సహకరించాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు అందించాలి. అలాగే ఏ నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారో దాని సంఖ్య వేసి సమాచారాన్ని 8790499899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి. వెంటనే అది సర్వర్‌కు వెళ్తుంది. ఆ సమాచారం కంప్యూటర్ ద్వారా ఆ నియోజకవర్గంలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు నిమిషాల్లో చేరుతుంది. వాళ్లు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి డబ్బులను స్వాధీనం చేసుకుంటారు. పంపిణీ చేస్తున్న వారిని అరెస్టు చేస్తారు.
 
  మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఆయన ఓటర్లకు పెద్ద ఎత్తున చీరలు, ఇతర దుస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వాటిపై బీజేపీ గుర్తుతో పాటు నరేంధ్రనాథ్ పేరు కూడా ముద్రించి ఉంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
  రాష్ట్రంలో ఓటర్లందరికీ బుధవారం నుంచి ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రారంభమైంది. బూత్‌స్థాయి ఆఫీసర్లు దీన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా భాగస్వాములు కావాలి.
  సీమాంధ్రలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలకు గడువు శనివారంతో ముగుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు సమర్పించాలి. నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ పార్టీ ధ్రువీకరిస్తూ ఇచ్చే ఇంక్ సంతకంతో కూడిన ఏ, బీ-ఫారమ్‌లను కూడా అదే రోజు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల పరిశీలన 21వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 23వ తేదీ 3 గంటలకు ముగుస్తుంది.
  పార్టీల స్టార్ ప్రచారకులతో పాటు ఆఫీస్ బేరర్లకు ఐదు వాహనాల చొప్పున ఎన్నికల ప్రచారానికి పాస్‌లను సీఈసీ కార్యాలయం జారీ చేస్తుంది. పాస్‌లు తీసుకున్న వారు మాత్రమే ఆ వాహనాల్లో తిరగాలి.
  ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి ఎటువంటి పరిమితులు లేవు. పార్టీ పరంగా చేసిన వ్యయాన్ని ఆ పార్టీ వ్యయంగానే పరిగణిస్తారు. పోటీ చేసే అభ్యర్థి పేరుతో పాటు పార్టీ గుర్తు ఉంటేనే ఆ వ్యయాన్ని సదరు అభ్యర్థి ఖాతాలోకి తీసుకుంటారు. సామాజిక మీడియా ద్వారా పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. అభ్యర్థి పేరు సింబల్‌తో సామాజిక మీడియాలో ప్రచారం చేస్తే ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలోకి తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement