
మాకు సలహాదారే ఇన్‌చార్జి
సాధారణంగా ఎక్కడైనా ఓ ప్రభుత్వ విభాగానికి ప్రభుత్వ అధికారే ఇన్‌చార్జిగా ఉంటారు. కానీ కుటుంబ సంక్షేమశాఖకు సలహాదారు ఇన్‌చార్జిగా ఉన్నారట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఆ శాఖ ఉద్యోగులే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశాఖకు ఒక సలహాదారును నియమించారు. ఆయనకు కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చాంబర్‌కు పది అడుగుల దూరంలోనే చాంబర్ ఇచ్చారు. ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సిన టెండర్ల నుంచి వాళ్ల రిపోర్టులు చూసే వరకూ అన్నీ ఆయనే చూస్తుంటారని ఆశాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
తాజాగా మెడాల్ సంస్థకు రక్తపరీక్షల టెండరు అప్పజెప్పడంలో సలహాదారే కీలక పాత్ర పోషించారని, మేమంతా అక్కడున్నా డమ్మీలుగానే ఉన్నామని చెబుతున్నారు. జాయింట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు ఇలా అందరూ సలహాదారు కిందనే పనిచేస్తున్నామని కూడా చెబుతున్నారు. అంతెందుకూ ఆయన చెబితే మా ఉన్నతాధికారులెవరైనా తలవంచుకుని క్షణాల్లో పనిచేయాలని అంటున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి చాలా తెలివైన వారని, సీఎం కార్యాలయం సిబ్బందే చెప్పారట..అందుకే కుటుంబ సంక్షేమశాఖలో సలహాదారు అంటే చచ్చేంత వణుకు ఉద్యోగులకు..పాపం. అందుకే మాకు సలహాదారే ఇన్‌చార్జి అంటున్నారు వాళ్లు.