తొలగించిన సంస్థకే మళ్లీ టెండర్
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నాలుగు మాసాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు... సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా అక్కడి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో పారిశుధ్యం దారుణంగా ఉందని మండిపడ్డారు. పారిశుధ్య పనులు నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కుప్పంతోపాటు చిత్తూరు జిల్లాలోని మరో ఐదు ఆస్పత్రులు, కాకినాడ బోధనాసుపత్రిలో పారిశుధ్య పనులు నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థను తొలగించారు. అలా తొలగించిన సంస్థకే తాజా శానిటేషన్ పాలసీలో రూ.130 కోట్ల విలువైన టెండర్‌ను కట్టబెట్టడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శానిటేషన్ పాలసీకి మరో మూడేళ్లు గడువు ఉండగానే ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పేరుమార్చి టెండర్ వేసిన కంపెనీకే కట్టబెట్టారంటే ఏమేరకు అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. టెండర్లలో జరిగిన అవకతవకలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముక్కున వేలేసుకున్నారు.
అభ్యంతరాలకు గడువేది?
గతంలో తొలగించిన సంస్థ పేరు ఆల్ సర్వీసెస్. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంస్థ ఏ1 ఫెసిలిటీస్. ఆల్ సర్వీసెస్ డెరైక్టర్లే ఈ సంస్థలోనూ డెరైక్టర్లుగా ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు టెండర్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా కమిటీ లెక్కచేయలేదు. విచిత్రమేమంటే సాంకేతిక బిడ్‌లు పూర్తయ్యాక అభ్యంతరాలకు గడువివ్వాలి. కానీ, 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా సదరు సంస్థకు టెండర్ కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గతంలో పారిశుధ్యం, సెక్యూరిటీ వంటి వాటికి 77 ఆస్పత్రుల్లో కలిపి రూ.55 కోట్లు వెచ్చించేవారు.దాన్ని రూ.130 కోట్లకు పెంచేశారు. ఏ1 ఫెసిలిటీస్ సంస్థకు కేవలం పారిశుధ్యానికే రూ.91.44 కోట్లు కట్టబెట్టారు.
5 వేల మంది కార్మికులు ఇంటికే
కొత్త కాంట్రాక్ట్ సంస్థ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 77 ఆస్పత్రుల్లో 5 వేల మంది పారిశుధ్య, సెక్యూరిటీ కార్మికులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధి కోల్పోనున్నారు. వాస్తవానికి వీరికి మరో మూడేళ్ల కాంట్రాక్టు గడువు ఉంది. సర్కారు మధ్యంతర పాలసీ కారణంగా వీరి ఉపాధికి గండిపడనుంది. ముంబైకి చెందిన ఎ1 ఫెసిలిటీస్ సంస్థ కొత్తవారిని నియమించుకోనున్నట్లు తెలిసింది. అయినా తక్కువ మొత్తానికే పనులు చేస్తామన్న కాంట్రాక్టర్లను వదిలేసి, ఖర్చును రూ.55 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పెంచేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.