- ప్రతిపక్ష నేత పర్యటన నేపథ్యంలో సర్కారు నిర్ణయం
- అధికారులకు దావోస్‌లో ఉన్న చంద్రబాబు ఆదేశాలు
సాక్షి, అమరావతి: మూత్రపిండాల వ్యాధితో మృతిచెందిన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 20న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఐదు డయాలసిస్ యూనిట్లకు ఆదరా బాదరాగా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో జారీచేశారు. గత ఒక్క ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో 424 మంది రోగులు కిడ్నీ వ్యాధులతో మృతి చెందారు.జిల్లాలో ఒక్క రిమ్స్‌లో మినహా మరెక్కడా డయాలసిస్ సదుపాయం లేదు. రిమ్స్‌లోనూ సరిపడినన్ని యూనిట్లు లేవు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత మృతి చెందిన బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లాలో ఈనెల 20న పర్యటిస్తున్నారు. దీంతో దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు దీనిపై ఆరాతీసి తక్షణమే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో మూడు కేంద్రాలు ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. మార్కాపురం ఏరియా ఆస్పత్రి, కందుకూరు ఏరియా ఆస్పత్రి, కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మిగతా రెండు కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారంటూ జగన్‌మోహన్‌రెడ్డి నెలన్నర క్రితం ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో రాష్ట్రప్రభుత్వం రూ.262 కోట్లు నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.