
వచ్చే వారం టెట్ షెడ్యూల్!
♦ ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం
♦ జూన్‌లో డీఎస్సీ నిర్వహణపై పరిశీలన
♦ విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గతంలోనే ఆదేశించిన సుప్రీంకోర్టు తాజాగా సోమవారం కూడా మరోసారి టీచర ్ల నియామకాల స్థితిపై వివరణ కోరింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాము చేపడుతున్న చర్యలు, ఇతరత్రా ప్రక్రియపై నివేదికను సుప్రీంకు అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు నియామకాల నోటిఫికేషన్ కంటే ముందుగానే టెట్‌ను నిర్వహించాల్సి ఉండటంతో టెట్ ఏర్పాట్లపైనా దృష్టిపెట్టింది. టెట్ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి తేదీల వివరాలు ఉండేలా షెడ్యూలును సిద్ధం చే యాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
వచ్చే నెల్లోనే టెట్ నోటిఫికేషన్
టెట్ నోటిఫికేషన్‌ను మార్చి 1న జారీ చేసి, ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ తొలుత భావించింది. అయితే మార్చిలోనే నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న విద్యా వలంటీర్లు అంతా సెలవులు పెట్టి వెళ్లిపోతారని, విద్యా కార్యక్రమాలకు, వార్షిక పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందని విద్యాశాఖ ఆలోచించింది. దీనికితోడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా వేసవి సెలవుల్లోనే టెట్, డీఎస్సీకి చర ్యలు చేపట్టాలని కోరాయి. లేదంటే తమ పాఠశాలల్లో టీచర్లు లేకుండాపోతారని చెప్పాయి. కానీ ప్రస్తుతం టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించడంతో సాధ్యమైనంత ముందుగానే టెట్ నిర్వహించాలని, తద్వారా డీఎస్సీ కూడా ముందుగా నిర్వహించడం సాధ్యమవుతుందని భావిస్తోంది. దీంతో మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది.
జూన్‌లోనే డీఎస్సీ
డీఎస్సీ నిర్వహణ తేదీల పైనా విద్యాశాఖ పరిశీలన జరుపుతోంది. డీఎస్సీ షెడ్యూలుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్నందున ప్రతిపాదనలను సర్కారుకు పంపేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా డీఎస్సీని జూన్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఈలోగా డీఎస్సీల్లో నష్టపోయిన వారి వ్యవహారం కూడా తేలే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హేతుబద్ధీకరణను కూడా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డీఎస్సీ నోఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. విద్యాశాఖతోపాటు ఇతర సంక్షేమ శాఖల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15,628 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అందులో విద్యాశాఖ పరిధిలో 10,961 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో డీఎస్సీల్లో నష్టపోయిన వారికి ఎన్ని ఇస్తారన్నది తేలాల్సి ఉంది.