విద్యాప్రమాణాలు పాటించాల్సిందే | Educational standards must be follow | Sakshi
Sakshi News home page

విద్యాప్రమాణాలు పాటించాల్సిందే

Published Sun, May 1 2016 4:29 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

Educational standards must be follow

♦ కళాశాలలకు స్పష్టం చేసిన ప్రభుత్వం    
♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తున్నందున తనిఖీలు తప్పనిసరి
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాల కల్పనకు కచ్చితమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పకడ్బందీగా అమలుకు, బోగస్ విద్యార్థుల నివారణకు కాలేజీల తనిఖీలను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నందున, వీరికి మెరుగైన శిక్షణ అంది కోర్సు ముగిశాక ఉపాధి లభించేలా కాలేజీల్లో విద్యా బోధన ఉండేలా చూడాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు కాలేజీల్లో ఫీజులకు అనుగుణంగా ప్రభుత్వపరంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒక్కో ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు కూడా ఈ విద్యార్థులకు ఫీజుల కింద చెల్లిస్తున్నారు.

 20 శాతం కాలేజీలతోనే ఇబ్బందులు
 ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందుతున్న అన్ని కాలేజీల్లో విద్యాప్రమాణాలు, సౌకర్యాల కల్పన విషయంలో తనిఖీలు తప్పనిసరని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ‘మొత్తం కాలేజీల్లో 80 శాతం ఇబ్బందులు లేకుండా నడుస్తున్నా, మిగిలిన వాటిల్లో విద్యా ప్రమాణాలు ఇతరత్రా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇలాంటి కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సులు పూర్తి చే సిన వారికి ఎలాంటి ఉపాధీ లభించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాలేజీల తనిఖీలకు నిర్ణయం తీసుకున్నాం. అంశాల వారీగా చేపట్టిన కాలేజీల పరిశీలనలో ఏవైనా అవకతవకలు, నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం మా దృష్టికి వస్తే విద్యార్థులను మెరుగైన కాలేజీలకు మార్చేందుకు చర్యలు చేపడతాం’ అని ఉన్నతాధికారి చెప్పారు.

 ఉపాధిపై దృష్టితోనే
 ‘కొత్తగా ఏర్పాటు చేయనున్న సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందిస్తున్నాం. కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉపాధి పొందగలిగేలా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారేలా శిక్షణనిస్తాం. ఈ కోర్సుల సిలబస్‌లకు ప్రభుత్వం తుది రూపునిస్తోంది’ అని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement