
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి.
ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి.
సులభతరం కోసం సంస్కరణలు..
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్‌లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్‌డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్‌లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్‌లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్‌డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు.