
పకడ్బందీ ‘స్వయం ఉపాధి’కి కసరత్తు
♦ జవాబుదారీతనం కోసం ఫొటోలు, వీడియోలు తీయాలని నిర్ణయం
♦ ఈ ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఎస్సీ అభివృద్ధిశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో జవాబుదారీతనం పెంపొందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. సబ్సిడీ రూపేణా అందించే రుణాలు కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. స్వయం ఉపాధి, ఆర్థికస్వావలంబన పథకాల ద్వారా ప్రయోజనం పొందేవారు ఏ అవసరం కోసం దానిని తీసుకున్నారో వారు కచ్చితంగా ఆయా యూనిట్లను నెలకొల్పేలా తనిఖీలు, ఇతరత్రా రూపాల్లో నియంత్రణ ఉండేవిధంగా చర్యలు చేపట్టింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా అందిస్తున్న రుణాలకు సంబంధించి జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆయా యూనిట్లను నెలకొల్పేందుకు లబ్ధిదారులకు ముందుగా అవసరమైన శిక్షణను అందించనున్నారు. యూనిట్లను మొదలుపెట్టడం, నిర్వహించడం వంటి వాటిని వీడియోరికార్డు, ఫొటోల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డేటాబేస్‌ను తయారు చేసి, దశలవారీగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. థర్డ్‌పార్టీ పరిశీలన కింద జిల్లాస్థాయిల్లో ఆయా యూనిట్ల వద్ద పరిశీలించి ఆన్‌లైన్‌లో ఫొటోలు, వీడియోలను, తనిఖీ అంశాలను తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతి లబ్ధిదారుడి వివరాలను సేకరించి, ఆయా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయా.. లేదా అన్నది పరిశీలించనున్నారు. రుణానికి తగ్గట్టు పనులు చేయనివారిని, దుర్వినియోగం చేసే వారిని డిఫాల్టర్లుగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది 10 వేల మందికి స్కిల్ డెవలప్‌మెంట్
ఈ ఏడాది 10 వేల మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాల శిక్షణను అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ డా.ఎం.వి.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పదో తరగతి పాసైనవారు, ఫెయిలైన వారు ఖాళీగా ఉండకుండా ఆయా రంగాల్లో శిక్షణను అందిస్తామన్నారు. టీవీ, ఫ్రిజ్, ఇతర గృహోపకరణాల మరమ్మతు, ఎలక్ట్రీషియన్ శిక్షణ, ఇతరత్రా అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్‌లో ఒకనెల రోజులపాటు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు.