
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు.
బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు.