మొగ్ధుంపూర్‌లోఎండిన పొలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కమలాకర్
నేడు ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటల పరిశీలన
ఎంపీ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలు
నేతలు పార్టీని వీడకుండా ప్రత్యేక సమావేశాలు
నియోజకవర్గాల్లో నేతల మధ్య కొలిక్కిరాని అంతరాలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీఆర్‌ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటల ను పరిశీలించనున్నారు. ఆయన పర్యటనను విజ యవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పార్టీ అధినేతగా మాజీ సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రావడం ఇది రెండోసారి. మార్చి లో కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన కరీంనగర్ కదనభేరీసభలో పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలి పించాలని సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచే ప్రచార శంఖారావాన్ని పూరించారు. తాజా గా రైతుల పొలాలను పరిశీలించనున్నారు. నీరిచ్చే అవకాశం ఉన్నా .. పచ్చటి పొలాలను ప్రభుత్వమే ఎండబెట్టిందని, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లముందు ఎండిపోతోంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల్లో భరోసా నింపేందుకు కేసీఆర్ మరోసారి కరీంనగర్ రానున్నారు.
సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ తొలి సింహగర్జన సభ నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంట్. ఇటీవల కరీంనగర్ కదనభేరి బహిరంగ సభతో కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. గెలుపోటములు సహజమని, పదేళ్లు జనరంజకమైన పాలన సాగించామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అడ్డగోలు హామీలతో జనం మోసపోయి ఓట్లు వేశారని, రానున్న రోజులు బీఆర్‌ఎస్ పార్టీదేనని ధైర్యం నింపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఆవశ్యకత, కాంగ్రెస్ హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలను జాగృతం చేసే పనిలో బీఆర్‌ఎస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతున్నాయని, ఆ విషప్రచారంలో కార్యకర్తలు చిక్కుకోకుండా చూడాలని, కేడర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇదివరకే కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
రెండు పార్లమెంట్ స్థానాలపై గురి..
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలుపించుకునే దిశగా మాజీ సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ సీనియర్ నేతలు కావడం, అపారమైన అనుభవం ఉండటం, పదేళ్లల్లో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో వివరించి ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుని ఎలాగైనా రెండు సీట్లను కైవసం చేసుకునే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించడంపైనా దృష్టి సారించినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడటం, కొన్ని నియోజకవర్గాల్లో మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారితోనే ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోవడం వంటి సమస్యలపై దృష్టిసారించనున్నారు. అన్నదాతకు అండగా.. సర్కారుపై సమరం చేసేందుకు వస్తున్న బీఆర్‌ఎస్ అధినేత పర్యటనపై ఆసక్తి నెలకొంది.
‘చొప్పదండి’లో తారాస్థాయికి అసమ్మతి
చొప్పదండి నియోజకవర్గంలో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టిన ద్వితీయశ్రేణి నాయకులు.. కాంగ్రెస్, ఇతరపార్టీల వైపు వెళ్లారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత సుంకె తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జిగా సుంకె కొనసాగితే ఇతర పార్టీలోకి వెళ్లడమే మంచిదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చొప్పదండిలో నెలకొన్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం ఏ మేరకు దృష్టిసారిస్తుందో వేచి చూడాలి.
కేసీఆర్ పర్యటన సాగుతుందిలా
- ఉదయం 8.30కు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ చేరుకుంటారు.
- గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
- మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు.
- మధ్యాహ్నం 2గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలనెండిన వరిపంటను పరిశీలిస్తారు.
- మధ్యాహ్నం 3 గంటలకు శభాష్‌పల్లి వద్ద మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు.
- సాయంత్రం 4 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తారు.
- సాయంత్రం 5 గంటలకు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు బయల్దేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment