గెలుపు వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్‌ సమాలోచన.. | - | Sakshi
Sakshi News home page

గెలుపు వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్‌ సమాలోచన..

Published Mon, Mar 4 2024 12:35 AM | Last Updated on Mon, Mar 4 2024 9:29 AM

- - Sakshi

వినోద్‌కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధి నేతలతో సన్నాహక సమావేశం
ఈనెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభకు నిర్ణయం
ఎంపీ అభ్యర్థులుగా వినోద్‌కుమార్‌, కొప్పుల పేర్లు ప్రకటించే అవకాశం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ నుంచే పార్లమెంట్‌ ఎన్నికల కదనభేరి మోగించబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా.. లోక్‌సభ ఎన్నికల కసరత్తును ప్రారంభించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపేలా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగసభను వేదికగా చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే జనవరిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆదివారం మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీల వలసలు ఆపేలా.. అలాగే ఈనెల 12న కరీంనగర్‌లో నిర్వహించబోయే బహిరంగసభను సక్సెస్‌ చేయడంపై నేతలతో కేసీఆర్‌ సుధీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

దశమిరోజు ఇద్దరు అభ్యర్థుల ప్రకటన..

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధికి ముగ్గురు పేర్లతో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కు పంపింది. కాంగ్రెస్‌, బీజేపీకి ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీ ముఖ్యనేతల నుంచే ఇప్పటికే అభిప్రాయాలు సేకరించింది.

ఇక తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలోనే ఎంపీ అభ్యర్థులుగా కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించాలనుకున్నా.. ఆదివారం అష్టమి, సోమవారం నవమి కావడంతో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దశమి రోజు అధికారికంగా మొదట జాబితాలో కరీంనగర్‌, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని నేతలు చెబుతున్నారు.

లేదంటే ఈనెల 12న కరీంనగర్‌ ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధిష్టానం వీరిద్దరికీ జనవరిలోనే టికెట్‌పై గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వీరు తమ నియోజకవర్గం పరిధిలో వాల్‌రైటింగ్స్‌, ఫ్లెక్సీలతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అధికారికంగా అభ్యర్థుల ఖరారు చేసిన తరువాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగేందుకు నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఇవి చదవండి: పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్‌కు తెలుసు : మంత్రి సీతక్క

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement