సమావేశంలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఈటల, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది.
ఆయా భేటీల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు.
పార్టీ నేతలతో జవదేకర్ భేటీ
తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment