Sunil Bansal
-
ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకులు, కార్యక ర్తల మధ్య మెరుగైన సమన్వయ సాధన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఇతర నేతలు సమీక్షించనున్నారు. గురువారం నుంచి వరుసగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలతో భేటీ అయ్యి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో, పట్టణ ప్రాంతాల్లోని స్థానా ల్లో డివిజన్, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై ఆయా అంశాలపై సమీక్ష నిర్వహి స్తారు. గురువారం శివప్రకాశ్ నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలో పర్యటించనుండగా, మిగతా నేతలకు కూడా రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు తెలిసింది. సునీల్ బన్సల్, ఇతర నేతలు కూడా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌లకు కూడా కొన్ని ఎంపీ సీట్లలో నాయకుల మధ్య సమన్వయం సాధించే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని, ముఖ్యంగా మహిళలు, ఇతర వర్గాల వారిని కలుసుకుని మద్దతును కూడగట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల భేటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. -
ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలకభేటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జాతీయ నేతలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌లు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ నియామకంపై దృష్టి పెట్టనున్నారు.90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఖరారు చేయనున్నట్టు రాష్ట్రపార్టీవర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు పార్టీపరంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి ? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి ? అనే అంశంపై ఐదారు కమిటీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పనిలోపనిగా జాతీయ నేతలు అభిప్రాయసేకరణ జరిపాక బీజేఎల్పీనేతను ఎన్నుకోవాల్సి ఉన్నందున, ఈ భేటీల సందర్భంగా ఈ ఎన్నిక జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ముందుగానే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : కిషన్‌రెడ్డి ఎంపీ టికెట్లకు సంబంధించి దరఖాస్తులేవీ స్వీకరించడం లేదని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారు అనేది జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుందన్నారు. గతంతో పోల్చితే ముందుగానే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇప్పటికైతే నాలుగు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ గ్యారంటీపై చర్చ జరగలేదన్నారు. వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోటీచేస్తారనే దానిపై ఎలాంటి చర్చ కానీ, నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. -
బీజేపీ తొలి జాబితా రెడీ!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో, లేదా ఉన్నతస్థాయి సమావేశంలో అభ్యర్థులపై చర్చించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాధాన్యతాంశాల వారీగా తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చ రాత్రికల్లా ముగిస్తే వెంటనే 40మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే శుక్రవారం ఉదయం లేదా తర్వాతిరోజున విడుదల చేయనున్నారని పేర్కొంటున్నారు. అయితే సీఈసీ/ఉన్నతస్థాయి భేటీకన్నా ముందే.. అంటే గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి తమ కసరత్తు, 40మంది అభ్యర్థుల ముసాయిదాపై చర్చించి.. సీఈసీకి సమర్పించే జాబితాకు తుదిరూపం ఇవ్వనున్నట్టు తెలిసింది. వీలైతే సాయంత్రం ప్రధాని మోదీతోనూ రాష్ట్ర నేతల బృందం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోజంతా కసరత్తు చేసి.. బీజేపీ ముఖ్య నేతలు బుధవారం పొద్దంతా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో, పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు.. 40కి మందికిపైగా బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సీట్లపై ఏకాభిప్రాయం రాష్ట్ర నేతల చర్చల సందర్భంగా పోటీలేని, బలమైన క్యాండిడేట్లు ఉన్న నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో అంబర్‌పేట (కిషన్‌రెడ్డి), హుజూరాబాద్ (ఈటల రాజేందర్), గద్వాల (డీకే అరుణ), దుబ్బాక (ఎం.రఘునందన్‌రావు), మునుగోడు (కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (ఏపీ జితేందర్‌రెడ్డి), సూర్యాపేట (సంకినేని వెంకటేశ్వర్రావు), కల్వకుర్తి (టి.ఆచారి), నిర్మల్ (మహేశ్వర్‌రెడ్డి), వరంగల్ ఈస్ట్ (ఎర్రబెల్లి ప్రదీప్‌రావు), వర్ధన్నపేట (కొండేటి శ్రీధర్), బోథ్ (సోయం బాపూరావు), ఖానాపూర్ (రమేశ్ రాథోడ్), మహబూబాబాద్ (హుస్సేన్‌నాయక్), చొప్పదండి (బోడిగె శోభ), మహేశ్వరం(అందెల శ్రీరాములు యాదవ్), భూపాలపల్లి (చందుపట్ల కీర్తి) తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లలో జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్యనేతలు పోటీచేసే సెగ్మెంట్ల విషయానికొస్తే.. కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్.. ఇలా బీజేపీ ముఖ్య నేతలను బరిలో నిలపాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. జనసేన పోటీ నుంచి విరమించుకునేలా? బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ బుధవారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కార్యాలయానికి వెళ్లి చర్చించారని.. తెలంగాణలో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరినట్టు తెలిసింది. తెలంగాణలో పోటీ చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందని పవన్ వివరించగా.. పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని, పోటీ విరమించుకుని మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా హైదరాబాద్‌లో సమావేశాలు ముగిశాక ప్రకాశ్ జవదేకర్, బన్సల్, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. -
బీజేపీ బస్సుయాత్రలకు బ్రేక్?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ తలపెట్టిన రథ (బస్సు)యాత్రల యోచనను రద్దు చేసుకున్నట్టుగా పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. 26 నుంచి వచ్చేనెల 14వ తేదీ దాకా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేసేలా ఈ యాత్రలు చేపట్టాలని పార్టీ నాయకత్వం భావించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యాత్రలను కుదించి చేపట్టాలా? లేక కొద్దిరోజులు వాయిదా వేయాలా? లేదంటే పూర్తిగా రద్దు చేసుకోవాలా? అనే మీమాంసలో పార్టీ ఉన్నట్టుగా చెబుతుండగా, రద్దుకే అధికశాతం నాయకులు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా సమన్వయలేమి సమస్యతో ఉన్న నేపథ్యంలో.. మూడుచోట్ల యాత్రలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఒకరికి బాధ్యతలిస్తే మరొకరు సహకరిస్తారా లేదా? ఇదికాక 19 రోజుల పాటు పూర్తి సమయం కేటాయించడం.. తదితర సమస్యలు బస్సు యాత్రల రద్దుకు దారితీసినట్టుగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాల కంటే కూడా సంస్థాగతంగా పార్టీ పటిష్టత, ఎన్నికల మేనేజ్మెంట్కు సంబంధించి బూత్‌స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులకు జాతీయనాయకత్వం సూచించినట్టు సమాచారం. ఈనెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీల పనితీరు ఎలా ఉంది ? ఇవి చురుకుగా పనిచేస్తున్నాయా లేదా ? అన్నింటికీ కన్వీనర్లు, సభ్యులు ఉన్నారా లేదా అన్న అంశాల పరిశీలనకు మొత్తం 450 మంది రెండేసి మండలాల చొప్పున పర్యటించాలని నిర్ణయించారు. దీంతో పాటు గతంలో మధ్యలోనిలిపేసిన ‘బూత్సశక్తి అభియాన్’ను పూర్తిస్థాయిలో చేపట్టడం, దీనికి సంబంధించిన కార్యాచరణను కచ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రనాయకులను జాతీయ నాయకులు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ మరీ పట్టుదలతో ఉన్నట్టుగా నాయకులు చెబుతున్నారు. -
నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర పార్టీ సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.