![BJP party in charge Sunil Bansal Telangana visit postponed](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/BJP-FLAGS-3.jpg.webp?itok=Wx04MCSm)
పార్టీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ రాష్ట్ర పర్యటన వాయిదా
నేతల నుంచి అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పెండింగ్
ఇంకా 19 సంస్థాగత జిల్లాలకు ఖరారు కాని అధ్యక్షులు
పార్టీ ఎన్నికల పర్యవేక్షకులు కూడా అభిప్రాయాలు తెలుసుకున్నాకే అధ్యక్షుడి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి(BJP State new President) ఎన్నిక ఎటూ తేలడం లేదు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శనివారం ఇక్కడకు రావాల్సిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్(Sunil Bansal) పర్యటన వాయిదా పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనుండగా, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో బన్సల్‌ను ఢిల్లీలోనే ఉండాలని జాతీయ నాయకత్వం సూచించినట్టు సమాచారం. పార్టీకి సంబంధించి రాష్ట్రాన్ని 38 సంస్థాగత జిల్లాలుగా బీజేపీ విభజించింది.
వాటిలో 19 జిల్లాలకు అంటే సగం జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేశాక తదుపరి కార్యాచరణను చేపట్టనున్నారు. అయితే తొలుత జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నుంచి బన్సల్ అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకులు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే అధ్యక్షుడి నియామకానికి సంబంధించి మరోసారి రాష్ట్ర నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఈమె నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు అందాక, రాష్ట్ర అధ్యక్షుడి పేరును జాతీయ నాయకత్వం ప్రకటిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
సైద్ధాంతిక నేపథ్యమా లేక ప్రజల్లో గుర్తింపా?
రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం బీజేపీలో పాత–కొత్త నేతల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న, బలమైన సైద్ధాంతిక నేపథ్యమున్న వారికే అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని పాత నాయకులు కోరుతున్నారు. ఇటీవల కొందరు నాయకులు ఢిల్లీ కూడా వెళ్లి మరోసారి జాతీయ నేతలకు ఈ విషయం విన్నవించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించి, వచ్చే ఎన్నికల్లో అధికారం లోనికి రావాలంటే ప్రజల గుర్తింపుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వారికి అవకాశం కల్పించాలని ఇటీవలి మూడు, నాలుగేళ్ల కాలంలో పార్టీలో చేరిన కొత్త నాయకులు గట్టిగా కోరుతున్నారు.
జాతీయ నాయకత్వం సైతం ఈసారి కొత్త వారికి అవకాశం కల్పింస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు జరుపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పాత వారికి అవకాశం కల్పిస్తే, తమకు ఆ పదవిని ఇవ్వాలని కోరుతున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, ఇతర నేతలున్నారు. ఇంకోవైపు నుంచి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, అరి్వంద్ ధర్మపురి, ఎం.రఘునందన్ రావు, ఇతర నాయకులు తమను అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు.
సామాజిక సమతూకంపై భరోసా
ఇప్పటివరకు నియమించిన 19 జిల్లాల అధ్యక్షుల్లో సామాజిక సమీకరణలు సరిగా పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మహిళలకు ఒక్కరికి కూడా అవకాశం లభించకపోగా, బీసీల్లోని కొన్ని కులాలను ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోలేదని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే మిగిలిన 19 జిల్లాల అధ్యక్షుల నియామకం తర్వాత సామాజిక సమతుల్యత నెరవేరుతుందని, మొత్తంగా జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత లభిస్తుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై భేటీ
శనివారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై బీజేపీ కీలక భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment