సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ తలపెట్టిన రథ (బస్సు)యాత్రల యోచనను రద్దు చేసుకున్నట్టుగా పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. 26 నుంచి వచ్చేనెల 14వ తేదీ దాకా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేసేలా ఈ యాత్రలు చేపట్టాలని పార్టీ నాయకత్వం భావించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యాత్రలను కుదించి చేపట్టాలా? లేక కొద్దిరోజులు వాయిదా వేయాలా? లేదంటే పూర్తిగా రద్దు చేసుకోవాలా? అనే మీమాంసలో పార్టీ ఉన్నట్టుగా చెబుతుండగా, రద్దుకే అధికశాతం నాయకులు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా సమన్వయలేమి సమస్యతో ఉన్న నేపథ్యంలో.. మూడుచోట్ల యాత్రలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఒకరికి బాధ్యతలిస్తే మరొకరు సహకరిస్తారా లేదా? ఇదికాక 19 రోజుల పాటు పూర్తి సమయం కేటాయించడం.. తదితర సమస్యలు బస్సు యాత్రల రద్దుకు దారితీసినట్టుగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాల కంటే కూడా సంస్థాగతంగా పార్టీ పటిష్టత, ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు సంబంధించి బూత్‌స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులకు జాతీయనాయకత్వం సూచించినట్టు సమాచారం.
ఈనెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీల పనితీరు ఎలా ఉంది ? ఇవి చురుకుగా పనిచేస్తున్నాయా లేదా ? అన్నింటికీ కన్వీనర్లు, సభ్యులు ఉన్నారా లేదా అన్న అంశాల పరిశీలనకు మొత్తం 450 మంది రెండేసి మండలాల చొప్పున పర్యటించాలని నిర్ణయించారు. దీంతో పాటు గతంలో మధ్యలోనిలిపేసిన ‘బూత్‌సశక్తి అభియాన్’ను పూర్తిస్థాయిలో చేపట్టడం, దీనికి సంబంధించిన కార్యాచరణను కచ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రనాయకులను జాతీయ నాయకులు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ మరీ పట్టుదలతో ఉన్నట్టుగా నాయకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment