నల్లగొండ పట్టణంలో రోడ్‌షోలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
అవి చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా?
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు
అందుకే ప్రామిసరీ నోట్లు, గాడ్ ప్రామిస్‌లతో కొత్త నాటకాలు
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని విమర్శ
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.
వారిది ఢిల్లీకి గులాంగిరీ!
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్‌గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కేసీఆర్ యాత్రను చూసి వణుకు
కేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్‌రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం.
Comments
Please login to add a commentAdd a comment