సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో, లేదా ఉన్నతస్థాయి సమావేశంలో అభ్యర్థులపై చర్చించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రాధాన్యతాంశాల వారీగా తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చ రాత్రికల్లా ముగిస్తే వెంటనే 40మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే శుక్రవారం ఉదయం లేదా తర్వాతిరోజున విడుదల చేయనున్నారని పేర్కొంటున్నారు. అయితే సీఈసీ/ఉన్నతస్థాయి భేటీకన్నా ముందే.. అంటే గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి తమ కసరత్తు, 40మంది అభ్యర్థుల ముసాయిదాపై చర్చించి.. సీఈసీకి సమర్పించే జాబితాకు తుదిరూపం ఇవ్వనున్నట్టు తెలిసింది. వీలైతే సాయంత్రం ప్రధాని మోదీతోనూ రాష్ట్ర నేతల బృందం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
రోజంతా కసరత్తు చేసి..
బీజేపీ ముఖ్య నేతలు బుధవారం పొద్దంతా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో, పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు.. 40కి మందికిపైగా బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ సీట్లపై ఏకాభిప్రాయం
రాష్ట్ర నేతల చర్చల సందర్భంగా పోటీలేని, బలమైన క్యాండిడేట్లు ఉన్న నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో అంబర్‌పేట (కిషన్‌రెడ్డి), హుజూరాబాద్ (ఈటల రాజేందర్), గద్వాల (డీకే అరుణ), దుబ్బాక (ఎం.రఘునందన్‌రావు), మునుగోడు (కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (ఏపీ జితేందర్‌రెడ్డి), సూర్యాపేట (సంకినేని వెంకటేశ్వర్‌రావు), కల్వకుర్తి (టి.ఆచారి), నిర్మల్ (మహేశ్వర్‌రెడ్డి), వరంగల్ ఈస్ట్ (ఎర్రబెల్లి ప్రదీప్‌రావు), వర్ధన్నపేట (కొండేటి శ్రీధర్), బోథ్ (సోయం బాపూరావు), ఖానాపూర్ (రమేశ్ రాథోడ్), మహబూబాబాద్ (హుస్సేన్‌నాయక్), చొప్పదండి (బోడిగె శోభ), మహేశ్వరం(అందెల శ్రీరాములు యాదవ్), భూపాలపల్లి (చందుపట్ల కీర్తి) తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లలో జాబితాను రూపొందించినట్టు తెలిసింది.
ఇక బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్యనేతలు పోటీచేసే సెగ్మెంట్ల విషయానికొస్తే.. కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్.. ఇలా బీజేపీ ముఖ్య నేతలను బరిలో నిలపాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
జనసేన పోటీ నుంచి విరమించుకునేలా?
బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ బుధవారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కార్యాలయానికి వెళ్లి చర్చించారని.. తెలంగాణలో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరినట్టు తెలిసింది.
తెలంగాణలో పోటీ చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందని పవన్ వివరించగా.. పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని, పోటీ విరమించుకుని మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా హైదరాబాద్‌లో సమావేశాలు ముగిశాక ప్రకాశ్ జవదేకర్, బన్సల్, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment