మహారాష్ట్రలో బీజేపీ మొదటి జాబితా విడుదల
99 మంది అభ్యర్థుల ఖరారు
3 చోట్ల సిట్టింగ్‌లకు మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ ఆదివారం మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది.
ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు.
జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
బరిలో మరాఠా అభ్యర్థులు: జరంగే
ముంబై: మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే ఎన్నికల వేళ మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరాఠాలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దించుతానని ఆయన ప్రకటించారు. గెలుపునకు అవకాశం చోట మాత్రమే మరాఠా అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని మరాఠాల రిజర్వేషన్లకు మద్దతిచ్చే అభ్యర్థులకు పార్టీ, మతం, కులంతో సంబంధం లేకుండా తోడుంటామని ఆయన స్పష్టంచేశారు. తమ షరతులకు అంగీకరిస్తూ అభ్యర్థులు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని జరంగే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment