సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అందులోనూ కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తుండగా... మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేయగా... గత వారం సీఎస్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకొక స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ఎక్కడెక్కడ అవసరం ఉంది తదితర సమగ్ర వివరాలతో సంక్షేమ శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టడీ సర్కిళ్లు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
నిరంతరంగా శిక్షణ
ఇకపై ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే వాటిని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి వెంటనే ఉద్యోగార్థులతో ఒక బ్యాచ్‌ను ఎంపిక చేసి శిక్షణ మొదలు పెడతారు.
బ్యాంకింగ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు రెగ్యులర్‌గా ఉండటంతో వీటికి నిరంతరంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment